
ప్రజాశక్తి - మంగళగిరి : ప్రతి ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో భాగంగా పట్టణంలో ఇంటింటి సర్వేను చేపట్టారు. సర్వేను ఇందిరానగర్ డాక్టర్ వైయస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ పి.అనూష ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపేట, గండాలయపేట, ద్వారకా నగర్, ఇందిరానగర్, వీవర్స్ కాలనీ, ఎల్బి నగర్లలో ఎఎన్‌ఎంలు, ఆశాలు, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారన్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి టోకెన్ ఇచ్చి వారికి వచ్చేనెల 3వ తేదీన గణపతి నగర్‌లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ వద్ద వైద్యశిబిరంలో నిపుణులతో ఆరోగ్య పరీక్షలు చేయించి మందులు ఇస్తామని తెలిపారు. సర్వే బృందానికి ప్రజలు సహకరించాలని, సర్వే సమయంలో ఇంట్లో లేనివారు మైద్యశిబిరం జరిగే రోజు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శిబిరంలో 105 రకాల మందులు ఉచితంగా ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపవర్‌వైజర్ జయలక్ష్మి, ఎఎన్‌ఎంలు విజయకుమారి, వనజ, ఆశా వర్కర్ లక్ష్మీకాంతం, వాలంటీర్ సీతాదేవి పాల్గొన్నారు.