Sep 11,2023 22:02

వైద్యసిబ్బందికి సూచనలు ఇస్తున్న నోడల్‌ అధికారి రమేష్‌

ప్రజాశక్తి- పార్వతీపురం 
జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాట్ల పరిశీలనకు ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం, టిబి స్టేట్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ టి. రమేష్‌ సోమవారం సందర్శించారు. జిల్లా ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి. జగన్నాథరావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బందితో పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ నెలాఖరు నుండి జరగునున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముందస్తుగా ఏ విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు, మండలాల వారీగా టీములు, ప్రోగ్రాం జరుగు వేదికలు, తారీఖులు, షెడ్యూలు ప్రకారం వేస్తున్న స్పెషలిస్ట్‌ వైద్యులు, పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది తదితర అంశాలను పరిశీలించి చర్చించారు. అనంతరం డిఎంహెచ్‌ఒతో కలసి లక్ష్మీ నారాయణపురంలో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంను తనిఖీ చేశారు. అక్కడ ఒపి నిర్వహణ రికార్డులు, నిర్వహించిన పరీక్షల నివేదికలు పరిశీలించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి ఎన్‌సిడి - సిడి ఎంత మందికి తనిఖీ చేశారు, వాటి ఆన్లైన్‌ నమోదు వివరాలు ఎఫ్‌ డిపి యాప్‌లో పరిశీలించి తక్కువగా నమోదు ఉండడాన్ని చూసి కారణాలపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్యం అందించే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ఆశా కార్యకర్తలకు ఇవ్వబడిన మొబైల్‌లో ఇ- ఆశా యాప్‌లను పరిశీలించి ప్రతి రోజూ లాగిన్‌ అయి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నారా పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి. జగన్మోహనరావు, ఎఫ్‌ డిపి నోడల్‌ అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ శ్యామ్‌ కుమార్‌, వైద్యాధికారి ధరణి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.