ప్రజాశక్తి-అమలాపురం రూరల్
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం స్థానిక ఈదరపల్లి గ్రామంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 30 నుంచి నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల నిర్వహణ తీరుపై ట్రయల్ రన్ డెమో ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన పది కౌంటర్లను నిశితంగా పరిశీలించారు. తొలుత హెల్ప్ డెస్క్, తదుపరి రిజిస్ట్రేషన్ సర్జరీ సంప్రదింపులు విభాగం, చిన్నపిల్లల వైద్య నిపుణుల విభాగం, ప్రసూతి వైద్య నిపుణుల విభాగం, జనరల్ వైద్యుల సంప్రదింపులు విభాగం, ఆరోగ్య శ్రీ కౌంటరు, క్షయ వ్యాధి నివారణ మరియు వైద్య పరీక్షల డెస్క్, దంత వైద్య డెస్క్, మందుల పంపిణీ డెస్క్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డెస్క్ నందు వైద్య పరీక్షల పేపర్ వర్క్ ఆన్లైన్ నమోదుకు సంబంధించి సిబ్బందిని నియమించాలని సూచించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు కేర్ షిటులో నమోదు చేస్తూ వైద్య సేవలు ఫాలో అప్ కు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పేషెంట్ కు ఏరకమైన వైద్య సేవలు అవసరమో గుర్తించి వారికి రిఫర్ చేయబడిన శస్త్ర చికిత్సలు వారి సమీపంలోని ఆసుపత్రులలో నిర్వహించుకునే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి డెస్క్ నందు అక్కడ అందించే వైద్య సేవలు స్పష్టంగా అవగాహన కలిగేలా స్పష్టంగా చార్టుల్లో ప్రదర్శింప జేయాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించాలన్నారు. సర్వేలో గుర్తించిన ఆరోగ్య స్థితిగతుల వివరాలు ఏఎన్‌ఎంలు లాగిన్ లో నమోదు చేస్తూ వైద్యులకు ఆన్లైన్లో చేరవేయాలని, తదనుగుణంగా ఈ వైద్య శిబిరాలలో వైద్య చికిత్సలు అందించే వెసులుబాటు కలుగుతుందని జిల్లా వైద్య సేవలు సమన్వయ అధికారిని పద్మశ్రీ రాణి పేర్కొన్నారు. ఈ శిబిరాలలో 14 రకాల ల్యాబ్ పరీక్షలు తో పాటు 105 రకాల ఔషధాలను ఉచితంగా అందిస్తామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పర్యవేక్షణకై జిల్లాకు కేటాయింపబడిన రాష్ట్ర నోడల్ అధికారి ఈవూరు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఈ వైద్య శిబిరాలు నిర్వహణకుగాను పది డెస్క్ లను స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ట్రయల్ రన్ లో ఉత్పన్నమైన సమస్యలను పూర్తిగా సరిదిద్దుతూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదల ఆరోగ్య పరిరక్షణ భద్రత పట్ల భరోసాను కల్పిస్తారన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు దొర మాట్లాడుతూ సర్వేలో గుర్తించిన వ్యాధులను ఏఎన్‌ఎం లాగిన్ లో హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ వైద్యులకు చేరుస్తూ వైద్య సేవలు పారదర్శకంగా అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టా మన్నారు కార్యక్రమంలో ఎంపిపి కుడిపూడి భాగ్యలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి, సర్పంచ్ రాయుడు వరలక్ష్మి, అదనపు డిఎంహెచ్‌ఒ సిహెచ్‌వి.భరత్ లక్ష్మి, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుమలత, స్థానిక తహశీల్దార్ ప. శ్రీ పల్లవి, ఎం పిడిఒ జె.వెంకటేశ్వర రావు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










