Sep 28,2023 22:19

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణకు
పకడ్బందీగా ఏర్పాట్లు : కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ :
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 30వ తేదీన టెలిఫోన్‌ కాలనీ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ పరిధిలో నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సంబంధిత అధికారులు, వార్డు అడ్మిన్‌, ఆరోగ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 30వ తేదీ నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి 31, 32, 33, 34, 35, 36, 22, 42, 43 వార్డు సచివాలయాల పరిధిలో విస్తత ప్రచారం కల్పించాలన్నారు. వాలంటీరు, ఏఎన్‌ఎం సర్వేలను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వైద్యశిబిరం నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వైద్య శిబిరానికి వచ్చే ప్రజలు కూర్చోవడానికి, విభాగలవారీగా వైద్యులు పరీక్షలు నిర్వహించడానికి, మందుల పంపిణీ తదితర వాటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరం నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి విధులు కేటాయిస్తూ సత్వరం ప్రొసీడింగ్‌ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అధికారులు, వార్డు కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎంహెచ్‌ఓ డాక్టర్‌ లోకేష్‌, సీఎంఎం గోపి, స్థానిక కార్పొరేటర్‌ సయ్యద్‌ సర్దార్‌, వైద్యాధికారులు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.