Jun 30,2023 22:49

ప్రజాశక్తి-కాకినాడ జగనన్న ఆణిముత్యానికి కలెక్టర్‌ కృతికా శుక్లా ఆసరాగా నిలిచారు. పేదరికం పైచదువులకు అడ్డంకిగా ఉందని సాయం చేయాలని అడిగిందే తడవు సత్వరం సాయమందించారు. జగ్గంపేట మండలం, రాజపూడికి చెందిన నంగన అక్షయ పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 585 మార్కులు సాధించింది. జిల్లాస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ఐఐటిలో చేరాలనే లక్ష్యంతో టాలెంట్‌ టెస్ట్‌ రాసి ఒక ప్రముఖ జూనియర్‌ కళాశాలలో ప్రవేశం పొందింది. రెండేళ్లకు కలిపి రూ.3,20,000 అవుతుందని యాజమాన్యం చెప్పడంతో ఆర్థిక పరిస్థితి సహకరించక కలెక్టర్‌ను ఆశ్రయించారు. కలెక్టర్‌ వెంటనే రిలయన్స్‌ ఇండిస్టీస్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత ద్వారా శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో చేరేలా చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అక్షయ, ఆమె తండ్రి సత్యనారాయణ కలెక్టర్‌ కతికా శుక్లాను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.