ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని ఛందోలు గ్రామంలో గల నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయిలో జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో పాఠశాల స్థాయి, బాపట్ల నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి-2023లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా చిన్నారులైన షేక్ ఖదిర, షేక్ జాస్మిన్‌లకు ప్రభుత్వ బహుమానం పాఠశాల స్థాయిలో 3000 రూపాయలు, 2 వేల రూపాయలు విద్యార్థులకు రహదారుల డైరెక్టర్ షేక్ హుస్సేన్, గ్రామ పెద్దలు మున్నీరు విద్యార్థులకు అందజేశారు. బాపట్ల నియోజకవర్గ స్థాయిలో జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం బాపట్లలోని మునిసిపల్ హైస్కూల్‌లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గంలో ప్రథమ బహుమతి పొందిన షేక్ ఖజీరాకు రూ.15,000, ద్వితీయ బహుమతి పొందిన షేక్ జాస్మిన్‌కు రూ.10,000 శాసనసభ్యులు కోన రఘుపతి, ఆర్‌డిఓ సన్మానించి అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రహదారుల శాఖ డైరెక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ చిన్న నాటి నుంచి విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలని అన్నారు. మనం సాధించింది పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి కీర్తిని తెచ్చి పెడుతుందని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి ప్రోత్సాహకాలు అందించటం ప్రథమమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె మురళీధర్ పాల్గొన్నారు.










