
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని దాసన్నపేట ప్రాంతంలో ప్రసిద్ధ దేవాలయం జగన్నాథ స్వామి రథ నిర్మాణ పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఆలయంలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి మూలవిరాట్టులను దర్శించుకున్నారు. అనంతరం రథ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జగన్నాథ స్వామి రథయాత్రలో ప్రధానమైన రధాన్ని నిర్మించేందుకు దాతలు ముందుకు వచ్చారు. నా ఊరు విజయనగరం అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రూ.5 లక్షలు సేకరించిన నిధుల చెక్కును డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామికి అందజేశారు. ఆ చెక్కును దేవస్థానం అనువంశిక ధర్మకర్తలకు ఆయన అందజేశారు. అనంతరం రథనిర్మాణం పూర్తయ్యే విధంగా చూస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ ఆల్తి సత్యకుమారి, జోనల్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.