ప్రజాశక్తి - గుంటూరు : జగనన్న లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆదేశించారు. అనంతవరప్పాడు, కొర్నెపాడు లే ఔట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ ఆదివారం తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. మౌలిక సదుపాయాల కల్పన త్వరితగతిన పూర్తి చేస్తేనే ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదార్లు ఆసక్తి చూపుతారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ స్వంత ఇళ్లు ఉండాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిందన్నారు. లే ఔట్లలో తాగునీరు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, అవసరం ఉంటే విద్యుత్ శాఖ అధికారులకు తెలియచేయాలని చెప్పారు. లే అవుట్లలో తాను సోమవారం పరిశీలిస్తానని చెప్పారు. లబ్ధిధార్లు సైతం గృహ నిర్మాణానికి ముందుకు రావాలని సూచించారు. ఇందుకు సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలో వాలంటీర్లతో కలిసి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ భాస్కర్, ఈఈలు కోటేశ్వరరావు, కొండారెడ్డి, డిఈఈలు, ఎఈలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని శ్రీ శ్రీ శ్రీ చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు పొంగళ్ళు సందర్భంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు మద్దాలి గిరిధర్‌తో కలిసి మేయర్ పాల్గొన్నారు. దేవస్థానం వద్ద గల చెరువు ట్రాక్ మొత్తం ఆధునిక హంగులతో ఆధునీకరిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆడక పద్మావతి, సాదు ఉమామహేశ్వరి రాజేష్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










