Nov 14,2023 21:06

మాట్లాడుతున్న తిక్కారెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌ బిల్లుల విషయంలో కేసులు పెట్టవచ్చని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. మంగళవారం టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్‌ స్వామి స్వగృహంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బి.లక్ష్మన్నతో కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ బిల్లులు పెంచబోమని మాట ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారని, యూనిట్‌ ధర రూ.1.50 ఉండగా ప్రస్తుతం రూ.3 పైగానే ఉందని తెలిపారు. అది కూడా 50 యూనిట్లు దాటితే స్లాబు రేట్లు మారుతున్నాయని చెప్పారు. 2014-19 మధ్య వచ్చిన బిల్లులపై ప్రస్తుతం అదనంగా భారం వేసి వసూలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఈ విషయంపై ప్రజలు జగన్మోహన్‌ రెడ్డిపై కేసులు కూడా వేయవచ్చని సూచించారు. వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. జగన్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, టిడిపి, జనసేన పార్టీ కలిసి వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాయని పేర్కొన్నారు. టిడిపి, జనసేన సంయుక్తంగా విడుదల చేసిన మేనిఫెస్టోను 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' ద్వారా ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న రోజుల్లో టిడిపి అధికారం కోసం కలిసి పని చేయాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తెలుగు రైతు జిల్లా కార్యదర్శులు బూదూరు మల్లికార్జున రెడ్డి, ఎల్లారెడ్డి, అశోక్‌ రెడ్డి, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్‌నాథ్‌ రెడ్డి, విజయరామిరెడ్డి, వట్టెప్ప గారి నరసింహులు, వనికె నాగరాజు, మేకల నరసింహ, యోబు, జనసేన కార్యకర్తలు రామాంజనేయులు పాల్గొన్నారు.