Dec 29,2022 23:54

ఇదేం ఖర్మ నిరసనలో మాజీ మంత్రి బండారు

ప్రజాశక్తి- పెందుర్తి : జగన్మోహనరెడ్డి సిఎం కావడమే రాష్ట్ర ప్రజలు చేసుకున్న పెద్ద ఖర్మ అని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం మండలంలోని జెర్రుపోతులపాలెంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ మూడున్నరేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో ఇసుమంతైనా అభివృద్ధి జరగలేదన్నారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చి, సంక్షేమమంటూ ప్రజలకు చిల్లర వేస్తున్నారే తప్ప, శాశ్వతమైన ఉద్యోగం, ఉపాధి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టుగానీ, పరిశ్రమగానీ చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఒక్క ఛాన్స్‌ అన్నందుకు నమ్మి అధికారమిచ్చిన ప్రజలను, రాష్ట్రాన్ని నిండా ముంచేశారని, ఇదే జగన్‌ పాలనలో ప్రజలు చేసుకున్న ఖర్మ అని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమర్థవంతమైన, సుస్థిర పాలనకు తెలుగుదేశం పార్టీని, సిఎంగా చంద్రబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎం.అప్పలరాజు, తెలుగు మహిళ నేత మడక పార్వతి, మాజీ జెడ్‌పిటిసి రెడ్డి నారాయణరావు, పార్టీ మండల అధ్యక్షుడు కరకదేవుడు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనతోనే రాష్ట్రానికి భవిష్యత్‌
పిఎం పాలెం : చంద్రబాబు పాలనతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు అన్నారు. నెల్లూరుజిల్లా కందుకూరులో జరిగిన టిడిపి ర్యాలీలో దురదష్టవసత్తు వీరమరణం పొందిన పార్టీకార్యకర్తలకు నివాళులు అర్పించారు. అనంతరం ఐదవ వార్డులోని పరదేశిపాలెంలో కార్పొరేటర్‌ మొల్లి హేమలత ఆధ్వర్యంలో పార్టీ బిసి సెల్‌ రాష్ర ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, జిల్లా ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు, తెలుగు మహిళ భీమిలి అధ్యక్షురాలు బోయి రమాదేవి, జిల్లా ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ(శ్రీను) పర్యవేక్షణలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కందుకూరు ర్యాలీలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్‌, తెలుగు యువత అధ్యక్షులు కొండపు రాజు, బిసిసెల్‌ భీమిలి అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు ఉపాధ్యక్షులు ఇయ్యపు నాయుడు, నేతలు గొల్లంగి ఆనంద బాబు, బోర అప్పల సూరిబాబురెడ్డి, సొడిపిల్లి నారాయణరావు, దొరబాబు, పరమేశ్వరావు, కామరాజు, ఆనందరావు, గురువులు, సరస్వతి, నూకరాజు, మన్యాల హనుమంత్‌ పాల్గొన్నారు.