Oct 08,2023 00:30

జగన్మోహన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు : డిప్యూటీ సిఎం

జగన్మోహన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు : డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి - కార్వేటినగరం
పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన జగనన్న మరో అడుగు ముందుకేసి పేదల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, పేదలకు ఇంటి వద్దకే వైద్యం అందించడంతో చరిత్రలో నిలిచిపోయారని డిప్యూటీ సిఎం నారాయణస్వామి కొనియాడారు. శనివారం మండలంలోని ఆర్కేవిబి పేట గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి డాక్టర్‌ రోగులకు దేవునితో సమానమని అభివర్ణించారు. అనంతరం కంటి చూపు తగ్గిన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, కార్వేటినగరం కత్తెరపల్లిలోని పనిచేస్తున్న వైద్యుధికారులు ఈ క్యాంపుకు రావడం అభినందనీయమన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష మోడల్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు మాట్లాడుతూ పేదలకు వరమన్నారు. ఆర్‌కెవిబిపేటలో ఏర్పాటు చేసిన శిబిరానికి 700 మంది రోగులు హాజరయ్యారు. ఎవరికైనా శస్త్ర చికిత్స అవసరం అయితే ఏరియా ఆస్పత్రికి పంపుతామన్నారు. ఉచితంగానే పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామన్నారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ప్రభావతి మాట్లాడుతూ బీపీ, సుగర్‌ వ్యాధులు కంట్రోల్‌లు పెట్టుకోవాలని, అపుడే మందులు పనిచేస్తాయన్నారు. స్విమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ మాట్లాడుతూ పదేళ్లకు ముందే కార్వేటినగరం మండలంలో ప్రతి ఇంటిలో పూర్తి వివరాలను సేకరించి ఏ వయస్సు గలవారు ఎందరు ఉన్నారనే సంఖ్యతో సహా పుస్తకాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి దివ్యదుష్యంత్‌, ఎంపిపి లత బాలాజీ, మండల కన్వీనర్‌ శేఖర్‌రాజు, మాజీ జడ్‌పిటిసి దేవకి లోకనాథరెడ్డి, మాజీ కన్వీనర్‌ ధనంజయవర్మ పాల్గొన్నారు.