Sep 12,2023 23:59

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి -యంత్రాంగం
కలెక్టరేట్‌ :
రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి వంటి నీచమైన పాలన చరిత్రలో లేదని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల రూపకల్పన నిమిత్తం మంగళవారం విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జగన్‌ జైలుపక్షి అని, చంద్రబాబుని కూడా అలా పిలిపించాలని చూస్తున్నాడని ఆరోపించారు. వ్యవస్థలన్నీంటినీ మేనేజ్‌ చేసి జగన్‌ లండన్‌ వెళ్లిపోయి చంద్రబాబుని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించాడన్నారు. అఖరికి జ్యుడీషియర్‌ని కూడా మేనేజ్‌ చేసాడనిపిస్తోందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అనేది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. గుజరాత్‌లో సక్సెస్‌ అయ్యిందని ఆ ప్రాజెక్టును ఇక్కడకు తేవాలని చంద్రబాబు భావించారన్నారు. చంద్రబాబు చాప్టర్‌ క్లోజ్‌ అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని, ఎలా చెప్పడానికి ఆయనెవరని అయ్యన్న మండిపడ్డారు. జగన్‌ మళ్లీ గెలిస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.
వైసిపి అరాచకాలపై పోరాటం
గాజువాక :
వైసిపి అరాచకాలపై రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. గాజువాక పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. కార్యకర్తలు ఢలాీ పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో వైసిపి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు బలగ నాయుడు, శ్రీనివాస్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.