ప్రజాశక్తి-అద్దంకి: అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జ్యాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్బాలు పలికిన జగన్‌రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసంచేశారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్ధకంగా మారింది అని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి వెల్లడించారని, ఇది వైసీపీ చేతకాని పాలనకు నిదర్శనమని అన్నారు. సిఏంఐఇ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రిల్ నాటికి 4.0 శాతం ఉన్న నిరుద్యోగం డిసెంబర్ 2022 నాటికి 7.7 శాతానికి పెరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాలనలో పరిశ్రమల ద్వారా 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని వైసిపి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. కానీ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కమీషన్ల కక్కుర్తితో మూడున్నరేళ్లలో రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధికి గండికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 2సార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల ఉద్యోగాలిచ్చారని, కానీ ప్రతి ఏటా మెగా డీఎస్సీ అన్న జగన్ రెడ్డి ఒక్క టీచర్ ఉద్యోగమూ భర్తీ చేయలేదని తెలిపారు. ఐటి అభివృద్ధితో 34 వేల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 64,000 ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. జగన్‌రెడ్డి ఐటి కంపెనీలు తరిమేసి, అక్రమ కేసులతో స్కిల్ డెవలప్‌మెంట్‌ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రతినెలా 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి (ముఖ్యమంత్రి యువనేస్తం) ద్వారా అందించారని జగన్‌రెడ్డి దాన్ని రద్దు చేశారన్నారు. జగన్ పాలనలో గంజాయి అక్రమ రవాణాలో ఏపీ నెంబర్1 స్థానంలో ఉందని ఎన్సీబీ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) నివేదిక చెబుతోందని, ఇందుకు వైసిపి ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన అన్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
యర్రగొండపాలెం: అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్బాలు పలికిన జగన్‌రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశారని యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ధ్వజమెత్తారు. ఆదివారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో మూడున్నరేళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధికి గండి కొట్టారని ఆరోపించారు. అమరావతి నిర్మాణంతో 15 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడితే జగన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రతి ఏటా మెగా డీఎస్సీ అన్న జగన్‌రెడ్డి ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఏమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్‌వలి, పుల్లలచెరువు మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్, నాయకులు గురిజేపల్లి జిలాని, షేక్ వలి, షేక్ ఇస్మాయిల్, కంచర్ల సత్యనారాయణగౌడ్, తోటా మహేష్‌నాయుడు, మహమ్మద్ రఫీ, భాస్కర్, చేదూరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.










