Feb 13,2023 23:38

పుస్తకాన్ని ఆవిష్కరిస్తునన టిడిపి జిల్లా అధ్యక్షులు నాగజగదీశ్వరరావు, టిడిపి నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి నిజాయితీ ఉంటే తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐకి సహకరించి దోషులను శిక్షించేందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ రెడ్డి వల్ల న్యాయం జరగదని, కేసును తెలంగాణ లేదా కర్ణాటక రాష్ట్రాలకు బదలాయించాలని సుప్రీంకోర్టులో వివేకానందరెడ్డి కుమార్తె మొరపెట్టుకోవడం హత్య వెనుక సూత్రధారులు ఎవరో తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు. జగన్‌ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవడానికైనా సిబిఐకి సహకరించాలని డిమాండ్‌ చేశారు. వివేక హత్య కేసు తమ నాయకుడు చంద్రబాబు నాయుడుపై సాక్షి ఛానల్‌, దినపత్రికలో అబద్ధపు ప్రచారాలతో నారాసర రక్త చరిత్ర పేరుతో ప్రసారం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పుట్టకనుంచి నేరచరిత్ర ఉన్న జగన్‌ రెడ్డిపై 11 సిబిఐ కేసులు, ఏడు ఈడి కేసులు, 13 పోలీస్‌ స్టేషన్‌ కేసులు, 158 స్టే పిటీషన్లు, 320 హాజరు మినహాయింపు పిటిషన్లుతో పాటు 16 మాసాల జైలు కూడు తిన్న ఘన చరిత్ర ఉందన్నారు. సిబిఐ విచారణతో వివేకానంద రెడ్డి హత్య కేసు తాడేపల్లి గుట్టు తేటతెల్లమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరే సతీష్‌, మల్ల గణేష్‌, దాడి వీర వెంకట అప్పారావు, కుప్పిలి జగన్మోహన్‌, దొడ్డి జగదీష్‌, సాలాపు నాయుడు, గుర్రాల వాసు, విల్లూరి రమణ బాబు, బుద్ధ భువనేశ్వరరావు, బోడి వెంకటరావు, చదరం శివ అప్పారావు పాల్గొన్నారు.