Apr 25,2023 19:23

సమావేశంలో మాట్లాడుతున్న ప్రదీప్‌రెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రజా ఆకర్షక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని వైసిపి రాష్ట్ర యువ నేత వై.ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన 'జగనన్నే మా భవిష్యత్తు'కు విశేష స్పందన లభించిందని తెలిపారు. నియోజకవర్గంలోని 60 వేల కుటుంబాలను కలిసినట్లు చెప్పారు. ఈనెల 7న 'జగనన్నే మా భవిష్యత్తు' మెగా పీపుల్స్‌ సర్వేను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటినీ సందర్శించి సంక్షేమ పథకాల అమలు తీరుపై అభిప్రాయాలను సేకరించినట్లు చెప్పారు. ఈ సర్వేలో తొలి 15 రోజుల్లో కోటి కుటుంబాలను పూర్తి చేయగా 79 లక్షల మిస్డ్‌ కాల్స్‌తో మద్దతు తెలిపారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో ప్రజలు సైతం జగనన్నే మా భవిష్యత్తు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. సర్వేకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాల గుండెల్లో దడ మొదలైందని చెప్పారు. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, పెద్దకడబూరు మండల అధ్యక్షులు రామ్మోహన్‌ రెడ్డి, వైసిపి సేవాదళ్‌ నాయకులు లక్ష్మి నారాయణ రెడ్డి, రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, నాయకులు రవి చంద్ర రెడ్డి, గజేంద్ర రెడ్డి, జనార్ధన్‌ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, దేవదానం, పరమేష్‌, ఈరన్న పాల్గొన్నారు.