ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జగన్ పాలనలోనే బీసీలకు సముచిత న్యాయం కల్పించడం జరిగిందని వైసిపి జిల్లా అధ్యక్షులు ఎంఎల్‌సి భరత్ అన్నారు. ఆదివారం స్థానిక బీసి భవన్‌లో వన్నికుల క్షత్రియుల సమావేశం చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న భరత్ మాట్లాడుతూ అసెంబ్లీ స్థానాలు, కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులతో బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్ మోహ్మన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీలను మోసపుచ్చేలా కళ్లబుల్లి మాటలు చెబితే నమ్మే పరిస్థితిలో బిసిలు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాను గెలిపించేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరోమారు జగన్ సిఎం కావడం ఖాయమని అన్ని వర్గాలకు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు బీసీలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు, బీసి నాయకులు జ్ఞాన జగదీష్, భూపేష్ గోపినాథ్ పాల్గొన్నారు.










