Nov 13,2023 19:46

ఆలూరు బ్రాంచి కాలువకు సాగునీటిని విడుదల చేయిస్తున్న మారయ్య

ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్మోహన్‌ రెడ్డి రైతులకు అన్ని రకాలుగా ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నారని, రైతులు కూడా ఈ నాలుగేళ్లలో మంచి పంటలు పండించి సంతోషంగా ఉన్నారని ఎంపిపి జూటూరు హేమలత, వైసిపి మండల కన్వీనర్‌ జూటూరు మారయ్య తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు బ్రాంచి కాలువకు సాగు, తాగునీటిని విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలూరు బ్రాంచి కాలువ కింద ఆయకట్టు, నాన్‌ ఆయకట్టు రైతులు వేల ఎకరాల్లో పత్తి, మిరప, శనగ, కంది, జొన్న పంటలను సాగు చేశారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇరిగేషన్‌ అధికారులు ఆలూరు బ్రాంచి కాలువకు హంద్రీనీవా కాలువ నుంచి విడుదలయ్యే సాగునీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. రైతుల విన్నపం మేరకు ఇటీవల సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాలువకు సాగు, తాగు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్‌ ఆధ్వర్యంలో విన్నవించగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్య పరిష్కరించాలని అక్కడున్న అధికారులను ఆదేశించారని తెలిపారు. ఆదివారం ఉదయం హాలహర్వి, చిప్పగిరి మండలాల రైతులతో కలిసి వెళ్లి, హంద్రీనీవా కాలువ నుంచి ఆలూరు బ్రాంచి కాలువకు నీరు వచ్చే విధంగా జెసిబి హిటాచ్‌లతో మట్టిని తీసి యథావిధిగా సాగునీరు విడుదల చేశామన్నారు. నాయకులు లాల్‌స్వామి, ధనుంజయ, లింగన్న, మురళీ, డేగులపాడు సర్పంచి నీలకంఠ పాల్గొన్నారు.