Oct 06,2023 09:06

మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు

          అనంతపురం కలెక్టరేట్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు అన్నారు. గురువారం టిడిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు కాపాడటంలో, రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణలో ముఖ్యమంత్రి ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్‌రెడ్డి అసమర్థ కారణంగా, లాలూచి కారణంగా, కేసుల నుంచి బయటకు పడటానికి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను తాకట్టు పెట్టడంతో రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. కృష్ణ జలాల పున్ణపంపిణీకి కేంద్ర ఆమోద ముద్ర వేసిందన్నారు. ఇది పూర్తిగా జగన్‌రెడ్డి వైఫల్యం అవుతుందన్నారు. బ్రిజేష్‌ కుమార్‌ తీర్పులోని అంశాలు నవ్యాంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఏర్పడిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర్రంలో 2015లో ట్రిబ్యూనల్‌కు లేఖ రాశారన్నారు. గాలేరు నగరి, నెట్ట్యంపాడు, శ్రీశైలం, ఆధారంగా మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు దేనికి కూడా హక్కులు కోరబోమని లేఖ ఇచ్చి రాయలసీమ భవిష్యత్తుకు రాజశేఖర్‌రెడ్డి మరణశాషనం రాస్తే, జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ హక్కులను బెంగళూరులో ఉండే తన ఆస్తులను కాపాడుకోవడానికి, విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని దోపిడీ చేయడానికి రాయలసీమ హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ జలాల పున్ణపంపిణీ జరిగితే రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తును అంధకారం చేయడమే అవుతుందన్నారు. అప్పర్‌భద్ర ద్వారా 173 టిఎంసీల అదనపు జలాలను వాడుకోవడానికి కర్ణాటక ప్రణాళికలు సద్ధం చేసుకుని అమలు చేస్తోందన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును జగన్‌ తాకట్టు పెడుతున్న కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఇప్పటికైనా నోరు విప్పి కేంద్రాన్ని రాష్ట్ర నీటి వాటాపై ప్రశ్నించాలని హితవు పలికారు.