Mar 05,2023 00:50
మాట్లాడుతున్న శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-అద్దంకి: జగన్‌ పాలనలో పారదర్శకత పూర్తిగా లోపించిందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. మండలంలోని పుట్టావారిపాలెంలోని ఆయన తన అతిథి గృహంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు. సహజ వనరులను, ప్రజల సొమ్మును దోచుకుతినడానికే వైసిపి నాయకులు అధికారంలోకి వచ్చినట్లుందని దుయ్యబట్టారు. అభివృద్ధి మృగ్యమైన రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని పేర్కొన్నారు. జగన్‌ దుష్ట పాలనపై మేధావులు సంధించే తొలి అస్త్రం ఎమ్మెల్సీ ఓటే కావాలన్నారు. గాడితప్పిన వ్యవస్థలను చక్కదిద్దే శక్తి ఒక్క చంద్రబాబుకే ఉందని అన్నారు. కావున రాష్ట్ర బాగుకోసం అందరూ తెలుగుదేశం పార్టీని బలపరచాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రజలను గందరగోళంలోకి నెట్టేలా రాష్ట్ర రాజధాని అంశాన్ని సర్కస్‌ ఫీట్‌గా మారుస్తోందని విమర్శించారు. మొన్నటిదాకా మూడు రాజధానులని అని ఇపుడు ఒకే రాజధాని అంటున్నారని, అది విశాఖనే అనడం తగదని అన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పిన ప్రభుత్వం ఇపుడు బెంచ్‌ మాత్రమే అంటున్నారని విమర్శించారు. కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానుల ప్రకటన అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పెట్టుబడుల కోసమే రాజధాని అనడం సిగ్గులేనితనమని విశాఖ నగరం ఇప్పటికే వాణిజ్య కేంద్రంగా ఉందని అన్నారు. అమరావతినే రాజధానిగా ఉండాలని, ఉంటుందని పేర్కొన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గత నాలుగేళ్ల నుంచి దరిద్రమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలను చేసుకోనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పేర్కొన్నారని, అందులో కనీసం 10 శాతం పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినా ఆనందమేనని అన్నారు. ఐటి ఎగుమతుల గురించి ఆహా ఓహో అని పాలకపక్షం చెబుతున్నప్పటికీ, అంత ఏమీ లేదని, కేవలం 150 కోట్ల ఎగుమతులు మాత్రమే జరిగాయని, పాలక పక్షం చెప్పే లెక్కలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు షమీమ్‌ ఖాన్‌, బల్లికురవ సంతమాగులూరు మండలాల గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, ఇన్‌ఛార్జిలు, తెలుగు యువత, తెలుగు మహిళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సెల్‌, ఐటీడీపీ, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు.