
ప్రజాశక్తి-నగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉన్నారని, రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే న్యాయస్థానం ఒక నిర్ధారణకు వచ్చి జైల్లో రిమాండ్ విధించిందని చెప్పారు. జైలు నిబంధనల ప్రకారం ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టానికి ఎవరూ చుట్టం కాదని చెప్పారు. కానీ నిన్న మొన్నటి వరకు చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న ఘనుడు చంద్రబాబేనని అన్నారు. సహజంగా ఎవరైనా జైలుకు వెళితే మానసిక వేదనతో ఆహారం సరిగా తీసుకోక బరువు తగ్గుతారని, కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అయన బరువు పెరిగారని చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు ఎంత ప్రశాంతంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళ్లే సమయంలో 66 కేజీలు ఉన్నారని, కానీ ప్రస్తుతం ఆయన ఒక కేజీ పెరిగారని, ఇది సంతోషకరమైన విషయమేనని చెప్పారు. చంద్రబాబు జైల్లో హాయిగానే ఉన్నారని, బయట మాత్రం టిడిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు విచిత్రంగా డప్పులు, ఈలలు, కొవ్వొత్తులు ర్యాలీలు, పళ్లాలు మోగిస్తూ నిరసనలు తెలియజేస్తున్నా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, పిఎసిఎస్ చైర్మన్ బెల్లంకొండ పోలేరు వెంకట్రామయ్య, గ్రామ సర్పంచ్ కేసన పున్నమ్మ వెంకట్రామయ్య, మండల పరిషత్ ఉప అధ్యక్షులు, కె లక్ష్మీ భ్రమరాంబ వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.