Sep 29,2022 23:07

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బివి.రామ్‌

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియోజకవర్గంలోనే మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలుగుశక్తి అధ్యక్షుడు బివి.రామ్‌ అన్నారు. విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కడప, పులివెందుల, ఇడుపులపాయ నియోజవర్గాలలో తాను పర్యటించి వచ్చానని చెప్పారు. సొంత జిల్లా, సొంత నియోజకవర్గం అధ్వానంగా ఉన్నా అభివృద్ధి చేయలేని జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కడపలో ప్రజలు ఉపాధి లేకుండా ఉన్నారని తెలిపారు. అక్టోబర్‌ 2వ తేదీన మూడు రాజధానుల అంశంపై సదస్సు పెడుతున్నామని చెప్పారు. విశాఖలో మంత్రులు అమర్‌నాథ్‌, బొత్స సత్యనారాయణ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారని, పాల్గొన్న 150 మందిలో 130 మంది వైసిపికి చెందిన వారే ఉన్నారని వివరించారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా, పార్టీ అభిప్రాయంతో ప్రభుత్వం నేడు మూడు రాజధానుల అంశానికి మద్దతు ఇస్తోందని విమర్శించారు.
ఇద్దరు కోవర్టులు
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఎస్‌ కృష్ణ కపర్తి, పిఎ రాజగోపాల్‌లను మార్చాలని బివి.రామ్‌ కోరారు. వారిద్దరూ కోవర్టులుగా మారిపోయారని ఆరోపించారు. దివ్యవాణి టిడిపికి దూరం కావడానికి వారే కారణమన్నారు. అలాగే కార్యకర్తలను కూడా పార్టీకి దూరం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అప్రమత్తమై వారిద్దరిని తక్షణం తొలగించాలని విజ్ఞప్తి చేశారు.