ప్రజాశక్తి - మంత్రాలయం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎల్లంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన రాజు చేపట్టిన బైక్ యాత్ర గురువారం మంత్రాలయం చేరుకుంది. రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం సృష్టించి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని గత నెల 14న నెల్లూరు జిల్లా నుంచి బైక్ యాత్ర చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల మీదుగా సాగుతోందన్నారు. 44 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయం చేరుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు మంత్రాలయం సర్పంచి తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో బైక్ యాత్ర చేపట్టిన రాజుకు ఘన స్వాగతం పలికారు. ముందుగా పూలమాల వేసి శాలువాతో సన్మానించి అభినందించారు. బైక్ యాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర సాగించడం అభినందనీయమని సర్పంచి భీమయ్య కొనియాడారు. 2024 ఎన్నికల్లో తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాజుకు కొంత ఆర్థిక సహాయాన్ని సర్పంచి భీమయ్య అందించారు.
రాజుతో మాట్లాడుతున్న నాయకులు










