బిసిలను విస్మరించిన వైసిపి
యాదవులకు, రజకులకు అండగా ఉంటాం
'ఆదరణ' ద్వారా కులవృత్తులను కాపాడుతాం
యువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
202వ రోజు ఉంగుటూరు నియోజకవర్గంలో సాగిన యాత్ర
టిడిపిలోకి పలువురు వైసిపి సీనియర్ నేతలు
ప్రజాశక్తి - ఉంగుటూరు
సిఎం జగన్ యాదవులతో పాటు అన్ని బిసి కులాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్ర 202వ రోజు శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో సాగింది. ముందురోజు తూర్పుగోదావరి జిల్లాలో సాగిన యాత్ర ఉదయం 11 గంటలకు ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. తొలుత నీలాద్రిపురంలో యాదవులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. యాదవులకు ఉచితంగా గొర్రెలు పంపిణీ చేయాలని, మేత, దాణా కోసం కొంత భూమి కేటాయించాలని, రెయిన్ కోట్లు, దోమ తెరలు అందించాలని, 50 ఏళ్లు దాటిన గొర్రెల కాపరులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలని, వర్షాకాలంలో గొర్రెలకు వచ్చే దొమ్మ రోగాలకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని, కూలిపనుల్లేక యాదవ మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారికి ఆవులు లేదా గేదెలు ఉచితంగా పంపిణీ చేయాలని లోకేష్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో యాదవులతోపాటు అన్ని బిసి కులాలను సిఎం జగన్ తీవ్ర నిర్లక్ష్యంచేశారన్నారు. బిసి సబ్ ప్లాన్ నిధులు రూ.75,790 కోట్లు దారిమళ్లించారని, కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. టిడిపి హయాంలో యాదవ కార్పొరేషన్ ద్వారా రూ.278 కోట్లు, పశుసంవర్థకశాఖ ద్వారా జీవాల కొనుగోలుకు రూ.395 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. టిడిపి వచ్చాక 22 గొర్రెలను యూనిట్‌గా తీసుకుని పంపిణీ చేస్తామని, బీమా సౌకర్యం కల్పిస్తామని, సబ్సిడీపై ఆవులు, గొర్రెలు అందిస్తామని ప్రకటించారు. జీవాలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేస్తామని, వ్యాధినివారణ మందులు, దోమతెరల పంపిణీకి చర్యలు తీసుకుంటామని, యాదవులు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలందజేస్తామని హామీ ఇచ్చారు.
టిడిపిలోకి వైసిపి సీనియర్ నేతలు
ఉంగుటూరుకు వైసిపి సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్‌ను వారంతా కలిసి పార్టీలో చేరారు. టిడిపి కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వేగేశ్న రంగరాజు, సోడింపల్లి రాజంరాజు, పచ్చ కృష్ణ, నూకల వెంకటేష్, పెన్మెత్స శ్రీనివాసరాజు, తమ్మిన నాగేశ్వరావు ఉన్నారు.
బిసి ప్రతినిధులతో ముఖాముఖీ
ఉంగుటూరులో బిసి సామాజికతరగతి ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యాదవులకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయమూ చేయడం లేదన్నారు. టిడిపి హయాంలో రజకులకు పనిముట్లు ఇచ్చారని, జగన్ ప్రభుత్వం రజక సామాజికతరగతిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కళింగ కులస్తులకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తమను ఆదుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వం మత్స్యకారుల పొట్ట కొట్టిందని, చెరువులు వేలం పెట్టి తమ చెరువులు లాక్కున్నారని, కొల్లేరుపై ఆధారపడిన బిసిలు అన్యాయానికి గురైయ్యారని తమను ఆదుకోవాలని కోరారు.
దీనిపై లోకేష్ మాట్లాడుతూ బిసిలను పేదరికం నుండి బయటకి తీసుకురావడమే తమ విధానమన్నారు. బిసిలకు పుట్టినిల్లు టిడిపి అని, వారికి రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది టిడిపి ఆవిర్భావం తరువాతేనని తెలిపారు. బిసిలకు 24 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్‌టిఆర్ అని తెలిపారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశామని, చంద్రబాబు బిసి రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారన్నారు. ఆదరణ పథకం ప్రవేశ పెట్టి కుల వృత్తులను కాపాడామన్నారు. తమ హయాంలో బిసిలకు కీలక పదవులిచ్చామని, బిసి సబ్ ప్లాన్, కార్పొరేషన్ ద్వారా ప్రతిఏడాదీ బిసిలకు రూ.మూడు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. సిఎం జగన్ బిసిలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16 వేల మందిని పదవులకు దూరం చేశారన్నారు. జగన్ పాలనలో ఒక్క బిసికి రుణం రాలేదని విమర్శించారు. బిసిలపై 26 వేల అక్రమ కేసులు పెట్టిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానిదేనన్నారు. అమర్నాథ్ గౌడ్‌ని వైసిపి నాయకులు అత్యంత కిరాతకంగా చంపేశారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. టిడిపి హయాంలో రజకులకు ఇస్త్రీ పెట్లు, వాషింగ్‌మెషిన్‌లు అందించామని, ఈసారి ఉచితంగా విద్యుత్ కూడా అందిస్తామని చెప్పారు. దోబీ ఘాట్లపై రజకులకు పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. ప్రతీ ఏడాది ఆదరణ పథకం అమలు చేస్తామని, చేతి వృత్తులను కాపాడతామని హామీ ఇచ్చారు.










