ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాలకు క్షేత్రస్థాయిలో సంభవించే సంఘటనలు ఏ మాత్రం సంబంధం లేదు. మూడు గంటల్లో బెడ్ ఇవ్వాలనే ఆదేశం అపహాస్యంగా వుంది. అదే అమలు జరిగితే ఆసుపత్రి వరండాల్లో అంబులెన్సుల్లో మరణాలు వుండేవి కావు. మరో విషాదమేమంటే ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా నిపుణులైన డాక్టర్లు...రోగులు వుండే వార్డుల లోనికి వెళ్లడం లేదనే ప్రచారం ఎక్కువగా వుంది. ఒకే బెడ్ పై చనిపోయిన రోగి ఆక్సిజన్ పీల్చుకొనే యువకుడు ఒక రాత్రి గడిపినట్లు వార్తలు వచ్చాయి. అంటే వార్డులో అజమాయిషీ ఎలా వుందో ఈ సంఘటన తెలియజేస్తున్నది.
ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు. యావత్ భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి అందర్నీ చుట్టబెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతున్నారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా చూడవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రజలు పడుతున్న నరకం అటుంచగా కరోనా అనంతర పరిస్థితులు ఊహించడానికే భయమేస్తోంది. ప్రథమ, ద్వితీయ ప్రపంచ యుద్ధాల అనంతరం యుద్ధ బీభత్సం మిగిల్చిన దేశాల్లో నెలకొన్న భయానక ఆర్థిక, సామాజిక, భౌతిక పరిస్థితులు కరోనా అనంతరం మిగల్చనున్నాయి. ఇక కరోనా కాలంలో కడగండ్లు చెప్పే పని లేదు. కుటుంబాలకు కుటుంబాలు మొత్తంగా మత్యువాత పడుతున్నాయి. తల్లి తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, భర్తలను పోగొట్టుకొంటున్న మహిళలు, భార్యలను పోగొట్టుకొంటున్న యువకులు... వీటన్నింటికి మించి కుటుంబాలకు ఆదరువుగా వున్న యువత వైరస్ బారిన పడుతున్న వ్యధా భరిత హృదయ విదారక సంఘటనలు సామాజిక ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ''ఊపిరి'' గురించి మాట్లాడుతున్నారు. మున్ముందు సామాజిక చట్రమే ఛిన్నాభిన్నం అవుతుందేమో. ఈ నేపథ్యంలో భవిష్యత్తు తలుచుకొంటే వెన్నులో చలి పుడుతోంది. ఈ మహమ్మారి ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేకున్నారు. అయితే దాన్ని కొంత మేరకైనా అదుపు చేసే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు పౌరులపై కూడా వుంది. దురదృష్టమేమంటే అది సద్వినియోగం కాక పోవడమే నేటి విషాదం.
ఏప్రిల్ ఒకటవ తేదీన అతి స్వల్పంగా కేసులు నమోదైతే సరిగ్గా ఒక మాసానికి ఏప్రిల్ 30వ తేదీకి అనూహ్యంగా 17,354 కేసులు నమోదయ్యాయి. ఏ ప్రభుత్వాలకైనా నెల రోజులు ఏమంత చిన్న సమయం కాదు. కాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రక్షణ ఇవ్వలేక పోయాయి. ఏప్రిల్ 30వ తేదీ అయిదు జిల్లాల్లో వేయికి పైగా రెండు జిల్లాల్లో రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తిరిగి అయిదారు రోజులకే అంటే మే నెల 5వ తేదీకి 22,204 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్క కడప జిల్లా తప్ప అన్ని జిల్లాల్లో వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో రెండు వేలకు మించాయి. ఏప్రిల్ 27వ తేదీకి 99,446 మంది యాక్టివ్ రోగులుంటే మే నెల 12వ తేదీకి ఈ సంఖ్య 1,97,370 చేరింది. ఇక మున్ముందు ఏ దశకు చేరుతుందో చెప్పలేము.
ఇదిలా వుండగా ఈ మధ్య కాలంలో ఆక్సిజన్ లభ్యం కాక చనిపోయిన వారిని అటుంచగా ఆసుపత్రిలో బెడ్ లభ్యం కాకుండా అంబులెన్స్ లోగాని ఆసుపత్రి కారిడార్ లేక మెట్ల మీద చనిపోయిన వారూ వున్నారు. యుద్ధ కాలంలో ఫిరంగుల గుండ్లు, విమానాలను విడిచే రాకెట్లతో ప్రజలు మృత్యువాత పడతారు. ఇప్పుడు కనిపించని సూక్ష్మ జీవితో పాటు ఆదుకోవాల్సిన ప్రభుత్వాల వైఫల్యాలు ధనిక మధ్య తరగతి పేద కులం మతం లేకుండా అందర్నీ శ్మశానాల పాలు చేస్తోంది. నేడు ప్రభుత్వాల వైఫల్యానికి తోడు ప్రజలు యుద్ధ కాలంలో బాంబుల దాడులు తప్పించుకొనేందు లభించిన ప్రతి షెల్టర్ ఉపయోగించుకొనడం చరిత్ర పుటలు తిరగేస్తే ఎరుగుదుము. నేడు ఎవరికి వారు షెల్టర్ తీసుకోవాలి. కాని అది కన్పించడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా నేటి జీవిత విధానం మనిషిని రోడ్డు మీదకు తెస్తోంది. ప్రధానంగా రెక్కాడితే గాని డొక్క నిండని పేద ప్రజలు రెండు విధాలుగా పిట్టల్లా రాలిపోతున్నారు. వీటన్నింటికి మించి యువత ప్రాణం మీదకు తెచ్చుకొంటోంది. కనిపించని శత్రువుకు బలి ఇస్తోంది. ఈ సందర్భంగా కనీసం ప్రభుత్వ పరంగా ఎలాంటి అదుపు కన్పించడం లేదు. ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. పాజిటివ్ రేట్ పది శాతానికి మించితే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నా ఆచరణలో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పే పని లేదు.
అంతేకాదు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాలకు క్షేత్రస్థాయిలో సంభవించే సంఘటనలు ఏ మాత్రం సంబంధం లేదు. మూడు గంటల్లో బెడ్ ఇవ్వాలనే ఆదేశం అపహాస్యంగా వుంది. అదే అమలు జరిగితే ఆసుపత్రి వరండాల్లో అంబులెన్సుల్లో మరణాలు వుండేవి కావు. మరో విషాదమేమంటే ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా నిపుణులైన డాక్టర్లు... రోగులు వుండే వార్డులలోనికి వెళ్లడం లేదనే ప్రచారం ఎక్కువగా వుంది. ఒకే బెడ్ పై చనిపోయిన రోగి ఆక్సిజన్ పీల్చుకొనే యువకుడు ఒక రాత్రి గడిపినట్లు వార్తలు వచ్చాయి. అంటే వార్డులో అజమాయిషీ ఎలా వుందో ఈ సంఘటన తెలియజేస్తున్నది. ఇంత జరుగుతున్నా మంత్రులు ఏ జిల్లాలో కూడా పి.పి.ఇ కిట్లు ధరించి వార్డుల్లో తనిఖీ చేసిన సందర్భం లేదు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు ఎండనక వాననక పాద యాత్ర చేశారు. ప్రజల మధ్య గడిపారు. అదే అధికార పీఠం దరి చేర్చింది.
ఈ సందర్భంగా నేను చూచాను. నేను విన్నాను అనే సూక్తితో రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కాని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి అధికార నివాసానికే పరిమితమైనారు. రాష్ట్ర ప్రజలు ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొనేందుకు కాలు కదిపిన పాపాన పోలేదు. విపత్తు సమయంలో కూడా ఇంటి నుండి కాలు కదపక పోవడంపై కొందరు సోషల్ మీడియాలో 'ఎక్కువ కాలం ఐసొలేషన్ లో వున్నదెవరు?' అని కొంటెగా పోస్టులు పెట్టారు. ఎవరో పోస్టు పెట్టారనేది ముఖ్యం కాదు.
ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి అధికారం అప్పగించినందున అన్ని కరోనా రక్షణ నిబంధనలు చేపట్టి ఎట్టి సమాచారం లేకుండా వివిధ జిల్లాల్లోని కోవిడ్ ఆసుపత్రులను దర్శించి, వార్డుల్లో రోగులను ముఖ్యమంత్రి పలకరించలసిన సమయం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి మూడు నాలుగు జిల్లాల్లో పర్యటన చేస్తే రాష్ట్ర మంత్రులు కూడా తరచూ ఆసుపత్రులను తనిఖీ చేస్తారు. ఫలితంగా అధికారుల్లో గాని డాక్టర్లు, ఇతర సిబ్బంది గాని జవాబుదారీతనం పెరుగుతుంది. వాస్తవంలో కూడా పాదయాత్ర సందర్భంగా నేను చూచాను. నేను విన్నాను అనే నానుడి సార్థకం చేసిన వారౌతారు. అదే జరిగితే ఈ రోజు తాడేపల్లి నుండి ఇచ్చే ఆదేశాలకు, ఆచరణకు పొంతన లేదనే విమర్శలకు తావుండదు.
/ వ్యాసకర్త విశ్రాంత పాత్రికేయులు,
సెల్ : 9848394013 / వి. శంకరయ్య











