Sep 19,2023 21:34

కురుపాంలో దీక్షలు చేస్తున్న తెలుగు మహిళా నాయకులు

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ప్రతిపక్ష నేతను అక్రమ కేసుల్లో అరెస్టు చేయడానికి జీర్ణించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెలా విజయచంద్ర అన్నారు. చంద్రబాబు అరెస్టుపై నిర్వహిస్తున్న నిరసిస్తూ నవిరి కాలనీ కూడలిలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ తో కలిసి రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వాన్ని నిలువరించేందుకు టిడిపితో జనసేన కలిసి రావడాని తాము స్వాగతిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా ఉద్యోగులు, విద్యార్థులు యువత మద్దతుగా ర్యాలీలు నిర్వహించడం చూస్తుంటే చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకానికి అర్థం పడుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకట నాయుడు, ఎఎంసి మాజీ చైర్మన్‌ రెడ్డి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, బడే గౌరినాయుడు, టి.వెంకటరావు, కోలా సరిత, మధుసూదనరావు, నాయకులు బార్నాల సీతారామారావు, బోను చంద్రమౌళి, గురజాన చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
'బాబుతో నేను'లో పోస్ట్‌ కార్డు ఉద్యమం
కురుపాం : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద మంగళవారం తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపట్టామని, బాబు నిర్ధోషిగా బయటకు వస్తారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్లు శేఖర్‌ పాత్రుడు, పల్లారాంబాబు, జియ్యమ్మ వలస ఎంపిపి బొంగు సురేష్‌, టిడిపి నాయకులు ఎన్‌.కృష్ణబాబు, పి.వెంకట నాయుడు, నియోజకవర్గంలో గల టిడిపి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సాలూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని కోరుతూ టిడిపి నాయకులు, కార్యకర్తలు పోస్టు కార్డ్‌ ఉద్యమం చేపట్టారు. స్థానిక వెంకటేశ్వరా డీలక్స్‌ సెంటర్‌ లో నిర్వహించిన దీక్షా శిబిరం లో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ హాజరయ్యారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం జైలు అధికారుల కు టిడిపి నాయకులు కార్యకర్తలు పోస్ట్‌ కార్డ్‌లు రాసి పంపించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, పాచిపెంట మండల అధ్యక్షులు పిన్నింటి ప్రసాద్‌ బాబు, మక్కువ మండల నాయకులు మావుడి ప్రసాద్‌ నాయుడు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : చంద్రబాబు నాయుడుకు మద్దతుగా జియమ్మ వలస మండలం ఇటిక లో టిడిపి నాయకులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.టిడిపి అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కష్ణబాబు ఆధ్వర్యంలో బాబుతో నేను అని రాసి పలువురు నాయకులు పోస్టు కార్డులను చంద్రబాబు పేరుతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు మంగళవారం పోస్ట్‌ చేశారు.
మహిళలు రిలే నిరాహార దీక్ష
కురుపాం : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన స్థానిక టిడిపి కార్యాలయంలో వద్ద నియోజవర్గ తెలుగు మహిళ అధ్యక్షులు శానాపతి పావని ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కార్యక్రమంలో అరుకు పార్లమెంట్‌ తెలుగు మహిళా ఉపాధ్యక్షులు డొంకాడ మంగమ్మ, అరకు పార్లమెంట్‌ తెలుగు మహిళా కార్య నిర్వాహక కార్యదర్శి అక్కేన జగదీశ్వరి, టిడిపి సీనియర్‌ నాయకులు కోలా శ్రీదేవి, నియోజకవర్గంలో తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీతంపేట : మండల టిడిపి కన్వీనర్‌ తోట మొఖలింగం ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో పులిపుట్టి నుంచి పాదయాత్ర చేపట్టగా టిడిపి నాయకులు పడాల భూదేవి సంఘీభావం తెలిపారు. తోటి మహిళలతో కాలనడకతో ముక్కిడి పోలమ్మ గుడి వరకు వచ్చి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ లు సవర బాజన్న, సుజాత, మన్మధరావు, మహిళ నాయకులు బిడ్డిక జయలక్ష్మి, సంధ్యారాణి, మాజీ ఎంపిపి సవర కుంపి, సీనియర్‌ నాయకులు సవర మంగయ్య, బిడ్డిక రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేడు రైతు విభాగం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు
గుమ్మలక్ష్మీపురం : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కురుపాం మండల కేంద్రంలో రైతు విభాగం ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరసన దీక్షలు చేపడుతున్నట్లు కురుపాం నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు గురానా శ్రీరామ్మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5మండలాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.