Jul 30,2021 22:02

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో సిఎం వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఆగస్టు 25న కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. జగన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ ఎంపి రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌లో లిఖిత పూర్వక వాదనలకు సిబిఐ శుక్రవారం మరోసారి సమయం కోరింది. సిబిఐ నుంచి ఇంకా ఎలాంటి సమచారం రాలేదని సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీనిని వ్యతిరేకించిన రఘురామ తరపు న్యాయవాది వెంకటేష్‌... గడువు ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిబిఐ ఏదో ఒకటి చెప్పాలని, అందుకు మరింత సమయం ఇస్తామని విచారణను కోర్టు కాసేపు వాయిదా వేసింది. కొంతసేపటి అనంతరం సిబిఐ న్యాయవాది వచ్చి... తాము ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపించడం లేదని, విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసులో విచారణ ముగిసిందని, ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.