కడపప్రతినిధి జగ్జీవన్‌జ్యోతి పథకం కత్తిరింపులకు గురైంది. గత టిడిపి ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది తలెత్తిన ఆర్థిక ఇక్కట్ల నేపథ్యంలో వైసిపి ప్రభుత్వం కత్తిరింపులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లాలోని దళిత కాలనీలు, తాండాల్లోని వినియోగదారుల గుర్తించే సర్వేను పూర్తి చేసిన అనంతరం వేలాది మంది దళితుల విద్యుత్ సర్వీసులకు మొండిచేయి చూపించింది. ఫలితంగా జిల్లాలోని వేలాది మంది ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాల్లో జగ్జీవన్‌జ్యోతి కొడిగట్టిన నేపథ్యంలో కథనం..
జిల్లాలో కడప, రాజంపేట, రాయచోటి, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల డివిజన్లు న్నాయి. వీటి పరిధిలోని 20 సబ్ డివిజన్లలో 1.12 లక్షల ఎస్‌సి, ఎస్‌టి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్‌సి, ఎస్‌టిలకు జగ్జీవన్‌జ్యోతి పథకం కింద పలువురికి ఉచిత విద్యుత్ ప్రయోజనం లభిస్తోంది. ప్రభుత్వం గతేడాది నుంచి జగ్జీవన్‌జ్యోతి పథకం ప్రయోజనాలను దళితవాడలు, దళిత కాలనీలకు మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫలితంగా జిల్లాలోని పట్టణ శివార్లలో జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఎస్‌సి, ఎస్‌టి వినియోగదారులను ఉన్నతాదాయం కలిగిన వారి జాబితాలో చేర్చి సుమారు మూడు నుంచి ఐదు రకాల ఛార్జీలను వసూలు చేస్తుండ డం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది జూన్ నెలాఖరులోపు సర్వేను పూర్తి చేసింది. జిల్లాలో ఆరు డివిజన్ల పరిధిలోని ప్రొద్దుటూరు 20,796, మైదుకూరు డివిజన్ పరిధిలో 21,456, కడప డివిజన్లలో 12,123, రాజంపేట డివిజన్‌లో 20,774 అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. జగ్జీవన్‌జ్యోతి స్కీమ్ నిర్వహణపై సర్వే చేసిన అనంతరం పూర్తిస్థాయి బిల్లుల వసూలు చేస్తోంది. పెట్రో, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ సామాన్యులపై భారాలు మోపుతోంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరిగి నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో జగ్జీవన్‌జ్యోతి పథకం నిబంధనల పేరుతో భారం మోపడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది.
ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల్లో నివసించే దళితులకు జగ్జీవన్‌జ్యోతి పథకం దూరమైంది. పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న దళిత కాలనీలకు వర్తించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలోని 1,1,215 ఎస్‌సి, ఎస్‌టి కనెక్షన్లు కలిగిన విద్యుత్ వినియోగదారులపై రూ.12.74 కోట్లు భారం పడనుంది. గతేడాది నుంచి దళిత విద్యుత్ సర్వీసుల కుదింపులకు గురైన నేపథ్యంలో రూ.3.47 కోట్లు మాత్రమే భారాన్ని భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలెక్కన రూ. 8.26 కోట్లు మేర వసూలు చేస్తున్నట్లు ఓ అంచనా. జగ్జీవన్‌జ్యోతి పథకం నిబంధనల ప్రకారం దళిత తాండాలు, దళిత కాలనీలకు మాత్రమే వర్తింపు పేరుతో పట్టణ ప్రాంతాలకు లోపల, వెలుపల ఉండే దళితులు నష్టపోతున్నారు. ఎపి ట్రాన్స్‌కో ఎస్‌ఇ రమణ ఫోన్‌లో సంప్రదించగా జగ్జీవన్‌జ్యోతి పథకం కింద సర్వే చేసిన మాట వాస్తవమేనని, ఎంతమంది అనర్హులుగా తేలారో చూడాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం.










