Nov 02,2023 21:06

మల్లిపురం జగదీష్‌

పార్వతీపురంరూరల్‌: హైదరాబాదుకు చెందిన ప్రముఖ సాహితీ సంస్థ అజో విభొ కందాళం ఫౌండేషన్‌ వివిధ రంగాల్లో యుద్ధ ప్రతిష్టులైన వారికి అందించే సరిలేరు నీకెవ్వరు పురస్కారానికి పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గిరిజన రచయిత మల్లిపురం జగదీష్‌ ఎంపికైనట్లు ఆ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2024 జనవరి 5న విశాఖపట్టణం కళాభారతిలో నాలుగు రోజుల పాటు అజోవిబో-కందాళం ఫౌండేషన్‌ రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాన్ని రూ.25 వేలు నగదు బహుమతితో పాటు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జగదీష్‌కు పురస్కారం లభించడం పట్ల పట్టణానికి చెందిన ప్రముఖ రచయితలు గంటేడ గౌరినాయుడు, చింతా అప్పలనాయుడు, సిరికి స్వామినాయుడు, పక్కి రవీంద్రనాథ్‌, పాలకొల్లు రామలింగస్వామి, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, బెలగాం భీమేశ్వరరావుతో పాటు పలువురు సాహితీ అభిమానులు అభినందనలు వ్యక్తం చేశారు.