Oct 20,2023 23:46

ప్రజాశక్తి-అమలాపురం
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. జిల్లా కలెక్టర్‌ పేషీలో జిల్లా కలెక్టర్‌చే జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్‌ సంబరాలు పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు చెకుముకి సైన్స మాసపత్రిక ఎడిటోరియల్‌ బోర్డు మెంబర్‌ ఇఆర్‌.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 33 సంవత్సరాలు గా జన విజ్ఞాన వేదిక విద్యార్థుల్లో సైంటిఫిక్‌ ఆలోచన కలిగించి, సైంటిఫిక్‌ జీవన విధానం అలవర్చుకునేందుకు కషిచేస్తోందన్నారు. అందులో భాగంగా విద్యార్థి చెకుముకి సైన్సు మాసపత్రికను నడుపుతోందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ పత్రిక సర్క్యులేట్‌ చేయబడుతోందన్నారు. పిల్లలలో శాస్త్రీయ సామర్థ్యాలను వెలికి తీసేందుకు జన విజ్ఞాన వేదిక 33 ఏళ్లగా చెకుముకి సైన్సు సంబరాలను నాలుగు స్థాయిలలో నిర్వహిస్తోందన్నారు. నవంబరు 10న పాఠశాల స్థాయి, 30న మండల/పట్టణ స్థాయి, డిసెంబర్‌ 17న జిల్లా స్థాయి, 2024 జనవరి 27, 28 తేదీతెకత రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజా మొహిద్దిన్‌ మాట్లాడేతై చెకుముకి సైన్సు సంబరాలను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో నిర్వహించాలని రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. జిల్లాలో అందరూ విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు విద్యార్థులను సైన్సు సంబరాల్లో పాల్గొనేట్లు చేయాలని, విద్యాభివృద్ధికి జన విజ్ఞాన వేదిక చేసే కృషికి సహకరించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవివి.సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి.ఖాజా మొహిద్దీన్‌, జిల్లా కోశాధికారి జి.త్రినాథ్‌ కుమార్‌, సీనియర్‌ నాయకుడు అబ్బిరెడ్ది రామకృష్ణ, జిల్లా ఆడిట్‌ కన్వీనర్‌ బిఎన్‌.వెంకటేశ్వరరావు, సీనియర్‌ నాయకులు వై.వెంకటేశ్వరరావు, జివి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.