Aug 20,2023 00:09
సైంటిఫిక్‌ టెంపర్‌ డే నిర్వహిస్తున్న జెవివి నాయకులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి జడ్పీ హైస్కూల్లో జాతీయ శాస్త్రీయ దక్పథ దినోత్సవం శనివారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షులు వై. భాస్కరరావు ఆధ్వర్యంలో నరేంద్ర దబోల్కర్‌ పదో వర్థంతి సందర్భంగా జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెదుళ్లపల్లి జడ్పీ హైస్కూల్‌ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు కే సుధ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ నరేంద్ర దబోల్కర్‌ జీవిత చరిత్ర నేటి రేపటి తరాలకు ఆదర్శం అనే అంశంపై మాట్లాడుతూ నరేంద్ర దబాల్కర్‌ మహారాష్ట్రకు చెందిన వైద్యుడు రచయిత మేధావి గొప్ప తాత్వికుడు హేతువాది మూఢనమ్మకాల నిర్మూలనకై అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు అని తెలిపారు అఖిల భారత నిర్మూలనా సమితిని మహారాష్ట్ర కేంద్రంగా స్థాపించి భారతదేశంలో మూఢనమ్మకాలకు అంధ విశ్వాసాలకు తొలగించే చట్టాలను ప్రతి రాష్ట్రంలో చేయాలని పోరాటం చేస్తున్న క్రమంలో 2013 ఆగస్టు 20న మతోన్మాదులు ఆయన మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న సమయంలో హత్య చేశారని అన్నారు. పోరాటం ఫలించి ఆయన హత్యకు గురైన మరుసటి రోజునే మహారాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం అమలులోకి తెచ్చిందని తెలిపారు. తరువాత కర్ణాటక ప్రభుత్వం కూడా మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తెచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా జన విజ్ఞాన వేదిక, హేతువాద, మానవవాద సంఘాలు కూడా నరేంద్ర దబోల్కర్‌ స్ఫూర్తితో మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తేవాలని, అలాగే దేశంలో సమకాలీన పరిస్థితులలో అత్యవసరమని అన్నారు. జన విజ్ఞాన వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు కే సుధ, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం రామచంద్రరావు, రాంబాబు, రాధాకృష్ణ, కరుణాకర్‌, కళ్యాణి అనురాధ సుప్రియ సరస్వతి సుభాని తదితరులు పాల్గొన్నారు.