Nov 19,2022 23:39

ధర్నాకు సంఘీభావం తెలియజేసి మాట్లాడుతున్న గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌

ప్రజాశక్తి - రాంబిల్లి
మత్స్యకారులకు జెట్టీ నిర్మించకుంటే వారు చేపల వేట ఎలా చేసుకుంటారని రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేవల్‌ బేస్‌ నిర్వాసితులు నేవీ మెయిన్‌ గేట్‌ ముందు చేపట్టిన ఆందోళన శనివారం నాటికి 20వ రోజుకు చేరింది. ఆందోళన శిబిరాన్ని సందర్శించిన ప్రసాద్‌ మాట్లాడుతూ మత్స్యకారులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, ఈ సమస్యలు తనకు 13 సంవత్సరాలుగా తెలుసని చెప్పారు. నావీ ప్రాజెక్టు కోసం భూములు, నదులు ఇచ్చి నిర్వాసితులకు న్యాయం చేయకపోవడం తనకు చాలా బాధ అనిపించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చొరవతో, మంత్రి అమర్నాథ్‌ దృష్టికి ఈ సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఐద్వా సంఘీభావం
ఈ ధర్నా శిబిరాన్ని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌.అరుణ, నాయకులు ఆర్‌.లక్ష్మి, జి.లక్ష్మి శనివారం సందర్శించి నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వలన ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల్లో సగభాగమైన మహిళలకు పురుషులతో సమానమైన ప్యాకేజీలు అందించాలని, నిర్మాణ పనులు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇన్ని సంవత్సరాలుగా నిర్వాసితులు సమస్యలు పరిష్కరించకపోవడం ప్రభుత్వాలకు తగదన్నారు.
ఆశించిన విధంగా లేని మినిట్స్‌ కాపీ
ధర్నా శిబిరాన్ని జిల్లా మత్స్యశాఖ జెడి లక్ష్మణరావు, తహశీల్దారు భాగ్యవతి సందర్శించారు. ఈ నెల 18న అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వాసిత గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే రమణ మూర్తిరాజు, జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు మినిట్స్‌ కాఫీని ధర్నా శిబిరంలో చదివి వినిపించారు. మినిట్స్‌ కాఫీలో నిర్వాసితులు ఆశించిన ఫలితాలు లేకపోవడంతో ఎనిమిది గ్రామాల పెద్దలు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడు నాయుడు, 8 గ్రామాలు పెద్దలు, వేలాదిమంది నిర్వాసితులు పాల్గొన్నారు.