ప్రజాశక్తి - రాంబిల్లి
నేవల్ బేస్ నిర్వాసిత మత్స్యకారుల చేపల వేట నిమిత్తం జెట్టీ నిర్మాణం ఇప్పట్లో సాధ్యం కాదని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి స్పష్టం చేశారు. 31 రోజులుగా నాబ్ నిర్వాసితులు నేవీ మెయిన్ గేట్ ఎదుట ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అమరావతి వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారుల సమక్షంలో బుధవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఎనిమిది గ్రామాల నిర్వాసిత పెద్దలతో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొత్తపట్నం వాడ నరసాపురం మత్స్యకారులకు నేవీ గేటు నుండి వెళ్లడానికి నేవీ అధికారులు నిరాకరించారని, వారికి ఒఎన్‌జిసి ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. గ్రామాలు తరలించే వరకు వాడ నరసాపురం గ్రామం వద్ద బీచ్‌లో బోట్లు పెట్టుకునేందుకు చదును చేస్తామని చెప్పారు. అర్హులైన వారికి నిర్మాణ కంపెనీలు, ఎస్‌ఇజెడ్ కంపెనీలతో మాట్లాడి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని, బ్రిడ్జింగ్ ప్యాకేజీ 587 మందికి ఇస్తామని వెల్లడించారు. నేవీ పునరావాస కాలనీ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, గంపల ప్యాకేజీ అందిస్తామని, ఎస్‌ఇజెడ్ నిర్వాసితుల వలే ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని తెలిపారు. నేవీ ప్రభావిత గ్రామాలైన చిన్న కలవలపల్లి, కొత్తపేట, గోవిందపాలెం, వాడపాలెం గ్రామాలను సర్వే చేస్తామని, మిగిలిన సమస్యలు రెండో విడతలో పరిష్కరిస్తామని, అర్థం చేసుకొని ధర్నాను విరమించాలని నిర్వాసిత నాయకులను కోరారు. దీనిపై నిర్వాసిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాటలు మీరే టెంట్ వద్దకు వచ్చి నిర్వాసితులతో చెప్పండి అని స్పష్టం చేసి వచ్చేశారు.
నిర్వాసితులను బూతులు తిట్టిన ఎమ్మెల్యే
చర్చల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి బయటకొస్తున్న నిర్వాసిత నాయకులను ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఆగి మాట్లాడమన్నారు. గతంలో నిర్వాసితులకు మీరిచ్చిన హామీలు ఏమిటీ? ఇప్పుడు ఇక్కడ జరుగుతుందని ఏమిటని నిర్వాసిత నాయకులు ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే 'నేను చెప్పింది అర్థం కాదా?' అంటూ బూతులు తిట్టారు. అక్కడ మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారన్న సంగతి మర్చిపోయి చెప్పడానికి వీలులేని బూతులు తిట్టారు. దీంతో నిర్వాసిత నాయకులు ఏమీ అనలేక అక్కడ నుండి వెళ్లిపోయారు.
31వ రోజు కొనసాగిన ఆందోళన
నేవీ నిర్వాసితులు నేవీ మెయిన్ గేట్ ముందు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 31వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎనిమిది గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
నేవీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయం
సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం
అనకాపల్లి : ప్రభుత్వం నేవీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 31 రోజులుగా ఎనిమిది గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పరిష్కరించకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు మూడు దఫాలుగా తూతూ మంత్రంగా చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మత్స్యకారులకు జెట్టీ నిర్మిస్తామని గతంలో ఒప్పందంలో చెప్పి నేడు అందుకు అవకాశం లేదని చెప్పడం మత్స్యకారులను మోసగించడమే అవుతుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కనీసం నిర్మాణ పనుల్లో కూడా ఉపాధి కల్పించకపోవడం శోచనీయమన్నారు. మిగులు వ్యవసాయ భూములకు రోడ్లు వేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు. నేవీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం నాయకుడు జి.దేవుడు నాయుడు, ఏపీ మత్స్యకారుల సంఘం జిల్లా కార్యదర్శి చౌడిపల్లి గంగరాజు పాల్గొన్నారు.










