సాలూరు: మండలంలోని జీగిరాం జ్యూట్ మిల్లు కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మిల్లు యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందనే అభిప్రాయం కనిపిస్తోంది. 16నెలలుగా మిల్లును మూసివేయడంతో 1200 కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన జీతభత్యాలు పంపిణీ చేయడం లేదు. దీంతో కార్మికులు గత 45రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మిల్లు గేటు ముందే దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల జెఎసి నాయకులు డిప్యూటీ సిఎం రాజన్నదొరను కలిసి సమస్యలు వివరించారు. దీనికి స్పందిస్తూ రాష్ట్ర లేబర్ కమిషనర్, కార్మిక శాఖ మంత్రి కి లేఖలు రాశారు. ఈనెల 17,18తేదీల్లో సంబంధిత శాఖ కమిషనర్, మంత్రులతో చర్చిస్తానని ఆయన చెప్పారు. అయితే ఆ చర్చలు జరగకుండానే మిల్లు యాజమాన్య ప్రతినిధి సప్తగిరి డిప్యూటీ సిఎం రాజన్నదొరను విశాఖపట్నంలో కలిసి కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని కార్మికులు భావిస్తున్నారు. రెండు సార్లు విశాఖలో జాయింట్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగిన చర్చలకు డుమ్మా కొట్టిన యజమాని డిప్యూటీ సిఎంను కలవడం వెనుక ఆంతర్యమేమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారి వద్ద జరిగిన చర్చలకు హాజరై తన వాదనను వినిపించుకోకుండా డిప్యూటీ సిఎం రాజన్నదొర తో రహస్య మంతనాలు జరపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక శాఖ మంత్రి, లేబర్ కమిషనర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పిన రాజన్నదొర మిల్లు యజమాని తో చర్చించడం వల్ల కార్మికులకు చేకూరే ప్రయోజనం ఏమిటనేది ప్రశ్నార్థకంగా వుంది. మిల్లు యాజమాన్యంపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగకుండా యాజమాన్య ప్రతినిధి సప్తగిరి రాజన్నదొరను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సిఎం రాజన్నదొరకు జ్యూట్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే మిల్లు యాజమాన్యం, సంబంధించిన శాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో తన సమక్షంలో చర్చలు నిర్వహించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ చట్టాలకు లోబడి జ్యూట్ మిల్లును నడిపించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.










