Sep 10,2023 19:18

ప్రజాశక్తి - పోడూరు
           జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ (జెసిఐ) పాలకొల్లు రైసింగ్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిన్నూరు ఐడిఎల్‌ స్కూల్‌ ప్రాంగణంలో మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జెసిఐ పాస్ట్‌ జోనల్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ వేదాంతం ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతిఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు తగిన వైద్యసేవలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో పాల్గొన్న రోగులకు దంత వైద్య నిపుణురాలు డాక్టర్‌ మౌని కావలి, హెడ్‌, నెక్‌ సర్జన్‌ డాక్టర్‌ రుద్రరాజు జయదుర్గాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్‌ ఉమాదేవి కావలి, స్కిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సుభాషిని, డాక్టర్‌ ప్రశాంతి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్‌ జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మీనా మణిదీప్తి, ట్రెజరర్‌ సబిత, సభ్యులు కౌశిక్‌ శిరీష, నీలిమ, ప్రదీప్‌ విష్ణు, మురళీకృష్ణ, సుందరి, తరుణ్‌, సాయి, ఆచంట వెంకట సుబ్బారావు, వి.సదాశివమూర్తి పాల్గొన్నారు.