ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోనే తొలిసారిగా జెమ్స్ ఆస్పత్రిలో ఎన్యూరిజం ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జెమ్స్ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు డాక్టర్ పి.వెంకటేష్, సతీష్, ప్రియ వెల్లడించారు. జిల్లాకు చెందిన 62 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడంతో రాగోలులోని జెమ్స్ ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. తొలుత సిటి స్కాన్ తీయగా, మెదడులో అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు తేలిందన్నారు. మెదడులో రక్తనాళం ఉబ్బి (ఎన్యూరిజం), అవి పగిలిపోవడం వల్ల రక్తస్రావంతో పాటు తలనొప్పి వచ్చినట్లు గుర్తించామన్నారు. మెదడులోని రక్తనాళాలకు డిజిటల్ సబ్‌స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ చేయగా, ఆంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ ఎన్యూరిజం పగిలినట్లు తెలిసిందన్నారు. ఇలా జరిగే రోగుల్లో 10 నుంచి 15 శాతం మంది ఆస్పత్రికి తరలించే లోపే మరణిస్తారని చెప్పారు. రక్తనాళాలు పగిలిన నెల రోజుల్లోనే సగానికి పైగా మరణాలు సంభవిస్తాయన్నారు. ఈ కేసులో రోగిని అత్యవసరంగా ఎన్యూరిజం కాయిలింగ్‌కు తీసుకెళ్లామని తెలిపారు. సాధారణంగా మెదడు ఎన్యూరిజంలకు సంప్రదాయ పద్ధతుల్లో మెదడును తెరిచి క్లిప్పింగ్ చేస్తారని, ఈ రోగికి నిర్వహించిన అత్యాధునిక చికిత్సా విధానంలో తొడ రక్తనాళం ద్వారా మెదడు ఎన్యూరిజంకు కాయిలింగ్ చేయడం వల్ల తలపై ఎటువంటి రంధ్రం, కోత ఉండదన్నారు. ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ వల్ల శస్త్రచికిత్స సమయంలో వచ్చే ఇతర సమస్యలు, రోగికి ప్రాణాపాయం వంటివి తక్కువగా ఉంటాయని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి చాలా త్వరగా కోలుకోడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా చేసినట్లు తెలిపారు.










