Oct 27,2023 22:03

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. రూరల్‌ మండలానికి సంబంధించి శుక్రవారం జెకెసి సమావేశాన్ని కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపు హలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 138 మంది అర్జీలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం చూపాలన్నారు. ఆమేరకు ప్రతి ఒక్క అర్హత కలిగిన అర్జీలను వారం రోజులలోగా పరిష్కారం చూపాలన్నారు. జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జెకెసిలో స్వీకరించిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు, వాటి తదుపరి పరిష్కార చర్యల ప్రగతిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం నేపథ్యంలో నిర్వహిస్తున్న జెకెసి ద్వారా రూరల్‌ నియోజక వర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. జల జీవన్‌ మిషన్‌ కింద చేపడుతున్న పనులకు చెందిన నిధులను ఖర్చు చేయకపోవడంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని కోరారు. గ్రామీణ నియోజక వర్గ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన పనులను వేగవంతం చేయాలని కోరారు. ఎపి గ్రీనింగ్‌ అండ్‌ సుందరీకరణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చందన నాగేశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులు సమాంతరంగా చేపట్టడం జరుగుతోందని అన్నారు. 1902, జెకెసి కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌, సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌, డిఆర్‌ఒ జి.నరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు పి.జగదాంబ, కెవి.కృష్ణరావు, జి. శ్రీనివాసరావు, ఎస్‌జిటి సత్య గోవింద్‌, ఏ.ముఖ లింగం, ఎన్‌వి సత్యనారాయణ, కె.విజయ కుమారి, జి. పరశురామ్‌, ఇతర జిల్లా, మండల, డివిజన్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.