ప్రజాశక్తి - కాకినాడ
జెఎన్‌టియుకె ప్రాంగణంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్కిల్స్ సంస్థ సహకారంతో విదేశీ విశ్వవిద్యాలయాలలో ఎంఎస్ లేదా ఎంబిఏ కోర్సులు చేయాలనుకునే విద్యార్థుల కోసం స్టడీ అబ్రాడ్ ఫెయిర్-2023 సదస్సు నిర్వహించారు. అలూమ్ని ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఎపిఎసి సిహెచ్ ) సెక్రటరీ ప్రొఫెసర్ వై.నజీర్ అహ్మద్ ముఖ్యఅతిథిగా, ఉపకులపతి జివిఆర్.ప్రసాదరాజు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
డిఎపి కెవిఎ. మురళీకృష్ణ అధ్యక్షత వహించి స్వాగతం పలికిన కార్యక్రమంలో రెక్టార్ కెవి. రమణ, రిజిస్ట్రార్ ఎల్.సుమలత, ఒఎస్‌డి డి.కోటేశ్వరరావు, డైరెక్టర్ అడ్మిషన్స్ కె. పద్మరాజు, ఐఐఐపి అండ్ టి డైరెక్టర్ జి.యేసురత్నం, ఎఫ్‌యుఆర్ డైరెక్టర్ ఎస్. శివనాగరాజు, అపి స్కిల్స్ ఎండి పి.వి. రావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందభ్రంగా ప్రొఫెసర్ వై.నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా జెఎన్‌టియుకె, అప్ స్కిల్స్ సంస్థ సహకారంతో చేపట్టిన స్టడీ అబ్రాడ్ ఫెయిర్ విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాలల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల ట్యూషన్ ఫీజును ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చెల్లిస్తోందన్నారు. స్టడీ అబ్రాడ్ ఫెయిర్లో టాప్ 200 ర్యాంకింగ్‌లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించే అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ఉపకులపతి ప్రసాదరాజు మాట్లాడుతూ స్టడీ అబ్రాడ్ ఫెయిర్ -2023 కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జెఎన్‌టి యుకెలో నిర్వహించి ఆసక్తిగల విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాల యాలలో స్పాట్ అడ్మిషన్లు కల్పించి, స్కాలర్షిప్లు కూడా అందజేయనున్నట్టు తెలిపారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, లాత్వియా తదితర దేశాలకు చెందిన ప్రముఖ యూనివర్శిటీల ప్రతినిధులు స్టడీ అబ్రాడ్ ఫెయిర్‌లో పాల్గొని విద్యార్థులకు ఎంఎస్, ఎంబిఏ కోర్సులపై వివరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ భవనంలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను అతిథులు ప్రారంభించగా విద్యార్థులకు విదేశీ యూనివర్శిటీల ప్రతినిధులు కోర్సులపై వివరించారు కార్యక్రమంలో వర్శిటీ డైరెక్టర్లు, విభాగాధిపతులు, విదేశీ యూనివర్శిటీల ప్రతినిధులు, జెఎన్‌టియుకె, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, 2500 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో స్టడీ అబ్రాడ్ ఫెయిర్‌ను ప్రారంభించిన నజీర్ అహ్మద్, విసి ప్రసాదరాజు, విదేశీ వర్శిటీల ప్రతినిదులు










