
వీరఘట్టం: జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్)కు విశేష స్పందన వస్తోందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు అన్నారు. వీరఘట్టంలో సోమవారం ఏర్పాటు చేసిన జెఎఎస్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు. శిబిరంలో ఏర్పాటు చేసిన అన్ని కౌంటర్లను, ప్రత్యేక వైద్యుల కౌంటర్లను పరిశీలించారు. వైద్యులు, వైద్య సిబ్బందితో మాట్లాడి శిబిరంలో అందించాల్సిన వైద్య సేవలను వివరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్‌ను సందర్శించి శిబిరానికి వచ్చే ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార ప్రయోజనాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నవంబరు 10 వరకు జెఎఎస్ వైద్య శిబిరాలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో లక్షా 21వేల మంది వైద్య శిబిరాలలో వైద్య సేవలు పొందారని ఆయన చెప్పారు.
ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలి
అంతకు ముందు వీరఘట్టం ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలని స్పష్టం చేశారు. గర్భిణులకు తరచూ తనిఖీలు నిర్వహించాలని, హైరిస్క్ గర్భిణీలను గుర్తించి వారిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాతా, శిశు మరణాలు సంభవించరాదని ఆయన పేర్కొన్నారు. ప్రసవాలు విధిగా ఆసుపత్రిలో జరగాలని, ప్రసవాలు జరగక పోతే అందుకు బాధ్యులైన వారిని సస్పెన్షన్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టు త్వరలో భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ అరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ కొయ్యాన అప్పారావు, ఎంపిడిఒ వెంకట రమణ, స్థానిక వైద్యులు తదితరులు పాల్గొన్నారు.