Oct 06,2023 22:23

ముఖ్యమంత్రి ఒఎస్‌డితో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-భోగాపురం : మండలంలోని రామచంద్రపేటలో శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఒఎస్‌డి ఆర్‌.ముత్యాలరాజు పరిశీలించారు. అక్కడ వేర్వేగా ఏర్పాటు చేసిన స్టాళ్లకి వెళ్లి ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు ఏ విధంగా చేస్తున్నారు, వారికి ఏమేమి మందులు ఇస్తున్నారో పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ముందుగా సర్వే చేసి యాప్‌లో అప్లోడ్‌ చేసింది, లేనిది అడిగి తెలుసుకున్నారు. ఆయన పరిశీలిస్తున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీయరాదని అధికారులతోపాటు వ్యక్తిగత సిబ్బంది మీడియాను, ఇతరులను కూడా అడ్డుకున్నారు. చివరికి నాయకులను, కింది స్థాయి సిబ్బందిని కూడా ఆయన సమీపానికి వెళ్లకుండా అడ్డుకోవడం విశేషం. ఆయన వెంట కలెక్టర్‌ నాగలక్ష్మి, ఆర్‌డిఒ సూర్యకళ, తహశీల్దార్‌ చింతాడ బంగార్రాజు, ఎంపిడిఒ అప్పలనాయుడు, ఇఒపిఆర్‌డి సురేష్‌, వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.