ప్రజాశక్తి-విజయనగరం : జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు మంచి స్పందన లభించిందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మొత్తం 541 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే 517 పూర్తిచేశామని కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్యమంత్రికి వివరించారు. 2.53 లక్షల మందికి శిబిరాల్లో వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక వైద్య నిపుణులతో తనిఖీలు నిర్వహించడం వల్ల మహిళలు, గర్భిణులు ఎంతగానో ప్రయోజనం పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు చికిత్స కోసం ఏవిధంగా సంప్రదించాలనే అంశంపై వారిలో అవగాహన ఏర్పడిందని కలెక్టర్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో డిఎంహెచ్‌ఒ భాస్కరరావు, డిసిహెచ్‌ఎస్ గౌరీశంకర్, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములునాయుడు, సిపిఒ పి.బాలాజీ, జెడ్‌పి సిఇఒ రాజ్‌కుమార్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ అప్పలరాజు, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.