Sep 16,2023 21:57

జెఎఎస్‌ ఇంటింటి సర్వేను పరిశీలిస్తున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

పాలకొండ/వీరఘట్టం: జగనన్న ఆరోగ్య సురక్ష ( జెఎఎస్‌) శిబిరాల పట్ల ప్రజలకు విస్తత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం, పాలకొండ మండలాల్లో ఎఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పి, ఇతర వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే, పరీక్షలను శని వారం ఆయన తనిఖీ చేశారు. ఇంటింటి విచారణలో భాగంగా పరిశీలించిన వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెఎఎస్‌తో ప్రతీ కుటుంబానికి అత్యుత్తమ వైద్యం అందుతుందన్నారు. ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న వైద్య శిబిరాలకు 2, 3 రోజుల ముందే సంసిద్ధం చేయాలని చెప్పారు. శిబిరం నిర్వహించే తేదీ, సమయం, వైద్య నిపుణుల వివరాలు, ఉచిత పరీక్షలు గురించి తెలియజేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటినీ సర్వే నిర్వహించి ఇంటి వద్ద ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్‌ ఉమామహేశ్వరి, డాక్టర్‌ కె.తేజ్‌ రతన్‌ రాజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని నిడగల్లు గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులపై ఇంటి సర్వే జరుగుతుందని, ఈ సర్వేలో గుర్తించిన ఆరోగ్య సమస్యలను గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి టి.సూర్యనారాయణ, గ్రామ పెద్దలు శ్రీనివాసరావు, తిరుపతి నాయుడు, గ్రామ వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని బూర్జలో వైద్య బృందం,గ్రామ వాలంటీర్లు చేపడుతున్న జెఎయస్‌ ఇంటింటి ఆరోగ్య సర్వేను జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు పరిశీలించారు. ఈ సందర్బంగా వైద్య సిబ్బంది ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తికీ వారి ఆరోగ్య స్థితిని అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. వైద్య పరికరాల పని తీరును తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ కరపత్రాలను వివరిస్తూ ప్రతీ ఇంటికి వైద్య సిబ్బంది అందజేశారు. ఎఎన్‌ఎం, సిహెచ్‌ఒ, వాలంటీర్లు జెఎఎస్‌ యాప్‌లో ఇచ్చిన ఆరోగ్య అంశాలను కుటుంబంలో ప్రతి ఒక్కర్నీ అడిగి నమోదు చేయాలన్నారు. ప్రజలంతా జెఎఎస్‌ వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పెదంకలాం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ఎం.రాధాకాంత్‌, బూర్జ ఆయుష్‌ వైద్యాధికారి డాక్టర్‌ హేమాక్షి , వైద్య సిబ్బంది గోపి, నరసమ్మ,గాయత్రి, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.