Nov 04,2023 21:17

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, జిల్లా అధికారులు

ప్రజాశక్తి - పార్వతీపురం : జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌)కు రిఫరల్‌ కేసుల పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రిఫరల్‌ కేసులు సంబంధిత ఆసుపత్రులకు చికిత్సకు వెళ్లాలని, వైద్య సిబ్బంది సరైన పర్యవేక్షణ చేసి వైద్యం పొందేలా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రిఫరల్‌ ఆసుపత్రులకు వెళ్లే వారికి రూ.500 రవాణా ఛార్జీలుగా చెల్లిస్తున్నామన్నారు. అవసరం మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో సంబంధిత వైద్యులను సమన్వయం చేస్తూ ఆరోగ్య రక్షణకు సహకరించాలని పేర్కొన్నారు. జెనరిక్‌ మందులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి వారం గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. బడి ఈడు పిల్లలెవరూ బడి బయట ఉండరాదని స్పష్టం చేశారు. నిరంతర ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు లేదా ఓపెన్‌ స్కూల్‌ విధానంలో విధిగా ఉండాలన్నారు.
15 నుంచి విక్సిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర
భారత ప్రభుత్వం చేపడుతున్న విక్సిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ఈ నెల 15న ప్రారంభమవుతుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఇందులో నమోదు చేసుకోవడం ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమం నిర్వహించాలని ఆయన సూచించారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష (జె.ఏ.ఎస్‌)కు మంచి స్పందన వస్తోందన్నారు. జిల్లాలో 2400 వరకు రిఫరల్‌ కేసులు వచ్చాయని, వారు చికిత్స పొందుటకు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కంటి శస్త్ర చికిత్సలకు గుర్తించిన వారికి డిసెంబరు నాటికి శస్త్ర చికిత్సలు పూర్తి చేయుటకు షెడ్యూల్‌ తయారు చేశామన్నారు. జెఎఎస్‌ కు దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఆహారం సమకూర్చుతున్నామని, అందుకు బడ్జెట్‌ విడుదల చేయాలని కోరారు. జిల్లాలో ఇంకో పది వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవింద రావు, డిఆర్‌ఒ జె వెంకటరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌, ఐసిడిఎస్‌ పిడి ఎంఎన్‌ రాణి, సిపిఒ పి.వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.