Nov 18,2023 19:49

తూతూమంత్రంగా జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం
కనీసం పట్టని మంత్రులు, 15 మంది ఎంఎల్‌ఎలకు ఇద్దరే హాజరు
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ రాకపోవడంపై సభ్యుల అసంతృప్తి
ఇళ్ల నిర్మాణం, కరువు, సాగునీటి సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల ఏకరువు
ఎంపిపిలను మాట్లాడనీయడం లేదంటూ పోలవరం ఎంపిపి ఆగ్రహం
సమాచార పుస్తకాలివ్వడం సైతం నిలిపేసిన జెడ్‌పి అధికారులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

జిల్లాలోని సమస్యలకు పరిష్కార వేదికగా కొనసాగే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం తూతూమంత్రం అన్నట్లు మారిపోయింది. మంత్రులు, ఎంఎల్‌ఎలు జెడ్‌పి సమావేశాన్ని పూర్తిగా పట్టించుకోని పరిస్థితి కన్పిస్తోంది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాల్సిన సమావేశం నామకేవాస్తే అన్నట్లు తయారైందనే విమర్శలు విన్పిస్తున్నాయి. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. సమావేశం తీరు చూసిన వారందరిలో జెడ్‌పి సమావేశం ఇలా తయారైందేమిటనే చర్చ సాగింది. గత ప్రభుత్వ హాయాంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ప్రత్యేక స్థానం ఉండేది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశం సాగేది. మంత్రులు, ఎంఎల్‌ఎలు అంతా హాజరై ప్రజాసమస్యలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులను సమావేశంలోనే నిలదీసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండాపోయింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 మంది ఎంఎల్‌ఎలు ఉండగా జిల్లా పరిషత్‌ సమావేశానికి దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బాయిచౌదరి, ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు మినహా ఏఒక్క ఎంఎల్‌ఎ హాజరు కాలేదు. ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా జిల్లాల విభజన జరిగాక ఒక్క మంత్రి కూడా జిల్లా పరిషత్‌ సమావేశానికి హాజరు కావడం లేదు. జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, పశ్చిమ కలెక్టర్‌ పి.ప్రశాంతి సమావేశానికి హాజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జిల్లాలోని తొమ్మిది మండలాలు విభజనలో తూర్పుగోదావరి జిల్లాలో కలిశాయి. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు లేవెనెత్తే సమస్యలకు సమాధానం చెప్పేందుకు ఆ జిల్లా నుంచి కలెక్టర్‌గాని, జాయింట్‌ కలెక్టర్‌గాని ఏఒక్కరూ రాలేదు. దీంతో అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే కృష్ణా జిల్లా జెడ్‌పి సమావేశానికి ఇక్కడి అధికారులు వెళ్లకపోతే అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం తెలపడమే కాకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ సమస్యను తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. మంత్రులు, ఎంఎల్‌ఎలు సమావేశాలకు రాకపోవడంతో అధికారులను నిలదీసే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో సమస్యలపై సభ్యులకు సంతృప్తికరమైన సమాధానాలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని విధానపరమైన నిర్ణయాల విషయంలో మంత్రులు ఉంటే తర్వాత సిఎంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మంత్రులు రాకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లా పరిషత్‌ సమావేశంలో లేవనెత్తిన సమస్యలకు ప్రత్యేకత ఉంటుంది. మినిట్స్‌లో నోట్‌ అవుతాయి. తర్వాత సమావేశంలోపు పరిష్కరించకపోతే అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంఎల్‌ఎలు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రోజంతా జరగాల్సిన సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించి మమ అన్పించేస్తున్నారు. జెడ్‌పిటిసి, ఎంపిపిలు లేవనెత్తిన ఒకటి, రెండు సమస్యలపై ముక్తసరిగా సమాధానాలు ఇచ్చి ముగించేస్తున్నారు. పలు సమస్యలు తర్వాత సమావేశంలోనూ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కెఎస్‌ఎస్‌.సుబ్బారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పలు సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల గళం
తమ మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. నాడు-నేడుకు సంబంధించి స్కూళ్లలో పనులు జరగకపోవడం, నిండ్రకొలను పిహెచ్‌సిలో బెడ్స్‌ పెంచకపోవడం, సిబ్బంది నియామకం, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సమస్యలను సభ్యులు లేవనెత్తారు. పదెకరాల్లోపు అర్హులైన ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ వర్తించకపోవడం, డ్వాక్రాకు సంబంధించి భవనాలు పూర్తి చేయకుండా వదిలేయడం, ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటల పరిస్థితిపైనా, సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఆరోగ్యశ్రీలో ఎదురవుతున్న ఇబ్బందులు, భూసర్వేలో జరుగుతున్న అవకతవకలను, దెందులూరు వంటి మండలాల్లో సాగునీటి సమస్య వంటి అనేక సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు లేవనెత్తడంతో అధికారులు సమాధానాలిచ్చారు.
దెబ్బతిన్న పంటల పరిస్థితి ఏమిటీ
కోటగిరి శ్రీధర్‌, ఎంపీ

'గతంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవికోసం మంత్రి పదవిని సైతం వదిలేసేవారు. జిల్లా పరిషత్‌ ఎంత బాగా పని చేస్తే పరిపాలన అంతా బాగా జరుగుతుంది. చింతలపూడి వంటి మండలాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిస్థితి ఏమిటీ' అని ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అధికారులను ప్రశ్నించారు. దీనిపై వ్యవసాయశాఖ జెడి రామకృష్ణ మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలకు సంబంధించి రెండు రకాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రై డెడ్‌ కండీషన్‌లో 15 గ్రామాల్లో 1800 ఎకరాలు దెబ్బతిందన్నారు. వెదరింగ్‌ కండీషన్‌లో 8 గ్రామాల్లో 2,900 ఎకరాలకు ఇబ్బంది వచ్చిందని తెలిపారు. దెబ్బతిన్న పంటలకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందని, ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. జిల్లాలో ఏడు మండలాల్లోని 51 గ్రామాల్లో నాలుగు వేల ఎకరాల్లో 75 శాతం పంట దెబ్బతిందని, 11 మండలాల్లోని 91 గ్రామాల్లో 8,065 ఎకరాల్లో పంట వడిలిపోయే పరిస్థితి వచ్చిందని వివరించారు.
ఎంపిపిలను మాట్లాడనీయడం లేదు
పోలవరం ఎంపిపి ఎస్‌.వెంకటరెడ్డి

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపిపిలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం లేదంటూ పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ ప్రారంభంలో పోలవరం ఎంపిపి లేచి సమస్యలపై మాట్లాడగా సదరు అంశం వచ్చినప్పుడు మాట్లాడాలని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ అన్నారు. చాలాసేపు వేచిచూసిన తర్వాత జెడ్‌పిటిసిలు మాట్లాడటమే తప్ప ఎంపిపిలకు అవకాశం రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు సభలో గందరగోళం నెలకొంది. ఎంఎల్‌ఎలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.