Jul 12,2023 23:51

మేడికొండూరులో విద్యార్థులతో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి - మేడికొండూరు : మండల కేంద్రమైన మేడికొండూరు జెడ్‌పి పాఠశాలను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను పిలిపించి మళ్లీ పదవ తరగతిలో జాయిన్‌ చేయించారు. విద్యార్థులకు జెవికె కిట్లను అందజేశారు. మధ్యాహ్నం భోజనం నాణ్యత పరిశీలించారు. అందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ, ఎంఇఒలు యేసురత్నం, ఆలిమ్‌, డిప్యూటీ తహశీల్దార్‌ కె.శ్రీనివాస్‌, హెచ్‌ఎం కె.జయప్రద పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : ఆకస్మిక పర్యటనలో భాగంగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి బుధవారం గుంటూరు రూరల్‌ మండలం జొన్నలగడ్డలోని జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. గతేడాది 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఏయే కాలేజీల్లో చేరారో సమాచారం సేకరించాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సమాచారాన్ని 'చైల్డ్‌ ఇన్ఫో' వెబ్‌సైట్‌లో నమోదు చేశారా? లేదా? అని అడిగి తెలుసుకొని, చేయకుంటే వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. గతేడాది 10వ తరగతితో పోలిస్తే, ఉత్తీర్ణత శాతం తగ్గడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులను జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం ఏ విధముగా ఉన్నదో అడిగి తెలుసుకొని విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. జగనన్న విద్య కానుక పంపిణీ వివరాలు, నాడు-నేడు పనుల పురోగతిపై సమీక్షించారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట తహశీల్దార్‌, ఎంఇఒ పాల్గొన్నారు.