ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు 253 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ పాఠశాలకు పదేళ్లగా హిందీ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు నియమించకపోవడంతో విద్యార్థులు ఆ సబ్జెక్టులో వెనుకబడిపోతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించింది కాని సీలేరు హైస్కూల్‌కు హిందీ టీచర్‌ను నియమించలేదు. హిందీ సబ్జెక్టు బోధించేవారు లేకపోవడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు.
మరో వైపు తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఒకరు మాత్రమే ఉన్నారు. మరో తెలుగు పండిట్‌ను నియమించవలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం వలనే ఈ పరిస్థితి నెలకొంది. తెలుగు పండిట్ లేకపోవడంతో పెద్ద తరగతులకు విద్యాబోధన జరగడం లేదు. తెలుగు ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలని కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పాఠశాలకు తెలుగు పండిట్ ఉపాధ్యాయుడిని నియమించే పరిస్థితి లేనట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హిందీ, తెలుగు పండిట్ ఉపాధ్యాయులను తక్షణమే నియమించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.










