జిల్లాకు ప్రథమ పౌరుడు ఉన్నట్టా.. లేనట్టో తెలియక అంతా అయోమయం నెలకొంది. ఛైర్మన్ పదవికి కవురు శ్రీనివాస్ రాజీనామా చేసి రోజులు గడుస్తున్నా కొత్త ఛైర్మన్ ఎన్నికపై తాత్సారం ఎందుకు చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వైస్ ఛైర్మన్‌కు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలనే నిబంధన సైతం అమలు చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జెడ్‌పి ఛైర్మన్ ఎన్నిక అసలు జరుగుతుందా.. ఇన్‌చార్జిగా వైస్ ఛైర్మన్‌కు బాధ్యతలు ఇస్తారా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. జెడ్‌పి ఛైర్మన్ ఎన్నిక తాత్సారం వెనుక కొంతమంది చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఛైర్మన్ పదవికి 13 రోజుల క్రితమే కవురు రాజీనామా
వైస్ ఛైర్మన్‌ను ఇన్‌ఛార్జిగా నియమిస్తారా, లేదా?
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేవరకూ
ఛైర్మన్ కుర్చీ ఖాళీయేనా
బదిలీల నుంచి అన్ని ఫైళ్లపైనా ఛైర్మన్ సంతకాలు అవసరమే
ఏం జరుగుతుందో జెడ్‌పిటిసిలకే తెలియని వైనం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో 48 మండలాలు, దాదాపు 900 వరకూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాను ముందుండి నడిపించే జెడ్‌పి ఛైర్మన్ పదవి ఖాళీగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం జెడ్‌పి ఛైర్మన్ రాజీనామా చేస్తే వైస్ ఛైర్మన్‌కు వెంటనే ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడ అటువంటి పరిస్థితి సైతం లేకుండా పోయింది. జెడ్‌పిలో ప్రతి ఫైల్‌పై ఛైర్మన్ సంతకం తప్పనిసరి. అలాంటి పదవికి సంబంధించి తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. జెడ్‌పి ఛైర్మన్‌గా ఉన్న కవురు శ్రీనివాస్ స్థానిక సంస్థల కోటాలో ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. ఈ నెల 15న కవురు శ్రీనివాస్ ఎంఎల్‌సిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన జెడ్‌పి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగి దాదాపు 13 రోజులవుతోంది. నిబంధనల ప్రకారం జెడ్‌పి ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తే వైస్ ఛైర్మన్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి ఫైళ్లేవీ ఆగకుండా ముందుకు నడిపిస్తారు. జెడ్‌పి వైస్ ఛైర్మన్లుగా తాళ్లపూడి జెడ్‌పిటిసి పోతిన శ్రీలేఖ, పెదవేగి జెడ్‌పిటిసి పెనుమాల విజయబాబు ఉన్నారు. నిబంధనల ప్రకారం వీరిలో ఒకరికి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలి. ఇప్పటి వరకూ అది జరగలేదు. జెడ్‌పి ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంచడం నిబంధనలకు విరుద్దమని చెబుతున్నారు. ఛైర్మన్ అయినా ఉండాలి లేకపోతే స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ అయినా ఉండాలి తప్ప ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ఉంటాయి. ఆ ఫైళ్లపై ఛైర్మన్ సంతకాలు కీలకం. ప్రస్తుతం బదిలీల వ్యవహారం జరుగుతోంది. బదిలీల ఫైళ్లపై ఛైర్మన్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఛైర్మన్ పదవికి సంబంధించి ఎన్నిక, నియామకంపై తాత్సారం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
జెడ్‌పి ఛైర్మన్ ఎన్నిక జరిగేనా..?
జెడ్‌పి ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేసినప్పుడు ముందుగా వైస్ ఛైర్మన్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకూ అది జరగలేదు. తర్వాత ఎన్నికల కమిషన్‌కు ఛైర్మన్ పదవి ఖాళీగా ఉన్నట్లు తెలియపర్చాలి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అప్పుడు జెడ్‌పి సమావేశం నిర్వహించి నిబంధనల ప్రకారం ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. ప్రస్తుత ఛైర్మన్ రాజీనామా చేసి రోజులు గడిచిపోతున్నా ఏదీ నిబంధన ప్రకారం జరగని పరిస్థితి నెలకొంది. జిల్లా పరిషత్‌లో ఏం జరుగుతుందో జెడ్‌పిటిసిలకు సైతం తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలను సైతం పాత తేదీల్లో చూపిస్తూ ముందుకు సాగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు ప్రధాన కారణం జెడ్‌పి ఛైర్మన్ పదవి ఖాళీగా ఉండటమేనని చెప్పొచ్చు. జెడ్‌పి ఛైర్మన్ నియామకం, ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాకపోవడం వెనుక కొంతమంది వ్యూహాత్మకంగానే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తమ కనుసన్నల్లోనే అన్నీ జరగాలనే ఆలోచనతో ఈ వ్యవహారం సాగుతున్నట్లు చర్చ సాగుతోంది. అసలు జెడ్‌పి ఛైర్మన్ నియామకం జరిగేనా అనే అనుమానాలు సైతం నెలకొన్నాయి. ఏదేమైనా జిల్లా ప్రథమ పౌరుని అంశంలో ప్రభుత్వ తీరు వివాదాస్పదంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి.










