Feb 21,2023 22:17

ప్రస్తుత ఛైర్మన్‌ కవురు ఎంఎల్‌సి బరిలోకి
ఖాళీ కానున్న జెడ్‌పి ఛైర్మన్‌ పదవి
బిసి రిజర్వుడు కావడంతో ఆ జెడ్‌పిటిసిల్లో ఆశలు
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది బిసి జెడ్‌పిటిసిలు
మేకా శేషుబాబుకు జెడ్‌పి ఛైర్మన్‌ ఇవ్వనున్నట్లు ప్రచారం
ఖాళీ కానున్న యలమంచిలి నుంచి పోటీ చేయనున్నట్లు చర్చ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పీఠం ఎవరికి దక్కనుందోననే చర్చ వైసిపిలో పెద్దఎత్తున సాగుతోంది. జెడ్‌పి ఛైర్మన్‌ పదవి బిసికి రిజర్వుడు కావడంతో ఆ సామాజిక తరగతికి చెందిన జెడ్‌పిటిసిలంతా ఈ పదవిని ఆశిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతమున్న బిసి జెడ్‌పిటిసిల్లో ఎవరికైనా పదవి ఇస్తారా.. లేక వైసిపి అధిష్టానం కొత్త ఆలోచన చేస్తుందా అనే చర్చ సైతం నడుస్తోంది. ప్రస్తుత జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ను స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా వైసిపి ఎంపిక చేసింది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి పదవులు వైసిపి చేజిక్కించుకోనుండటంతో కవురుకు ఎంఎల్‌సి పదవి దాదాపు ఖాయమైనట్లే. దీంతో జెడ్‌పి ఛైర్మన్‌ పీఠం ఖాళీ కానుంది. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవీ కాలం దాదాపు మూడున్నరేళ్ల వరకూ ఉంది. దీంతో ఈ పదవి కోసం బిసి జెడ్‌పిటిసిలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 48 జెడ్‌పిటిసి స్థానాలు ఉన్నాయి. దీనిలో జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలి స్థానం మినహాయిస్తే భీమడోలు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నరసాపురం, పాలకోడేరు, పెదపాడు, ఉండి, ఉంగుటూరు జెడ్‌పిటిసిలు బిసిలు. నాలుగుచోట్ల పురుష జెడ్‌పిటిసిలు ఉండగా, ఐదుచోట్ల బిసి మహిళలు ఉన్నారు. అంతా జెడ్‌పి ఛైర్మన్‌ పదవికి అర్హులే. పెదపాడు జెడ్‌పిటిసి గంటా పద్మశ్రీ పేరు ఛైర్‌పర్సన్‌ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి పదవులు రెండు డెల్టా ప్రాంతానికి ఇవ్వడంతో మెట్ట ప్రాంతానికి జెడ్‌పి ఛైర్మన్‌ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అయితే వైసిపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
తెరపైకి మేకా శేషుబాబు పేరు?
జెడ్‌పి ఛైర్మన్‌ పదవి ఖాళీ కానుండటంతో ఆ పదవి మాజీ జెడ్‌పి ఛైర్మన్‌, మాజీ ఎంఎల్‌సి మేకా శేషుబాబుకు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు అధిష్టానం మేకా శేషుబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి కోటాలో పదవి కోసం మేకా శేషుబాబు చివరి వరకూ గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఎంఎల్‌సి పదవిని జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌కు ఇస్తున్నట్లు వైసిపి ప్రకటించింది. ఖాళీ కానున్న జెడ్‌పి ఛైర్మన్‌ పదవి శేషుబాబుకు ఇవ్వనున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కవురు శ్రీనివాస్‌ యలమంచిలి జెడ్‌పిటిసిగా ఉన్నారు. ఎంఎల్‌సిగా ఎన్నిక ప్రక్రియ పూర్తికాగానే కవురు జెడ్‌పిటిసి, జెడ్‌పి ఛైర్మన్‌ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖాళీ అయిన యలమంచిలి జెడ్‌పిటిసి స్థానానికి ఎన్నికలు నిర్వహించి ఆస్థానం నుంచి మేకా శేషుబాబును పోటీ చేయించాలని వైసిపి అధిష్టానం ఆలోచన చేసినట్లు సమాచారం. అధికారం వైసిపికి గెలుపు సునాయాసమనే అభిప్రాయం ఉంది.
జెడ్‌పిటిసిగా గెలిచిన తర్వాత శేషుబాబును జెడ్‌పి ఛైర్మన్‌ చేయాలని అధిష్టానం ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. గతంలో మేకా శేషుబాబు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి స్థానిక సంస్థల కోటాలో ఎంఎల్‌సిగా గెలిచారు. అక్కడ నుంచి ఆయన వైసిపిలోనే ఉన్నారు. అప్పట్లో జెడ్‌పి ఛైర్మన్‌గా ఉన్న కారుమూరి ఎంఎల్‌ఎగా గెలుపొంది వెళ్లిపోయారు. దీంతో కొంతకాలం అప్పట్లో బిసి రిజర్వుడుగా ఉన్న జెడ్‌పి ఛైర్మన్‌ పదవి మేకా శేషుబాబును వరించింది. జెడ్‌పి ఛైర్మన్‌గా గతంలోనూ పని చేసిన అనుభవం శేషుబాబుకు ఉంది. దీంతో శేషుబాబుకే జెడ్‌పి ఛైర్మన్‌ పదవి ఇచ్చేందుకు వైసిపి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.