Feb 04,2022 18:18

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ తిరస్కరించారు. కాల్పుల ఘటన అనంతరం ఆయనక జెడ్‌ కేటగిరి సెక్యూరిటీని ఇవ్వాలని కేంద్రం భావించింది. కాగా, ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. ' నాకు జెడ్‌ కేటగిరి సెక్యూరిటీ వద్దు. నేను సామాన్యుడిగా ఉండాలనుకుంటున్నా. నాపై కాల్పులు జరిపిన వారిపై ఉపాను ఎందుకు ప్రయోగించలేదు' అని ఇటీవల బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్న వారిపై ఎక్కువగా వినియోగిస్తున్న చట్టంపై ప్రశ్నించారు. 'పేదలు సురక్షితంగా ఉన్నప్పుడే.. నా జీవితం సురక్షితంగా ఉంటుంది. నా కారుపై కాల్పులు జరిపిన వారికి నేను భయపడేది లేదు' అని పార్లమెంట్‌లో అన్నారు. యుపి ఎన్నికల్లో పలు స్థానాల్లో అసదుద్దీన్‌ పార్టీ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గని ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఓ టోల్‌ ఫ్లాజా వద్ద అసదుద్దీన్‌ కాన్వాయ్ పై దుండగులు కాల్పులు జరిపిన సంగతి విదితమే. కాగా, ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా, ఇద్దర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.