Aug 20,2023 22:34

జడ్‌పి సిఇఒ భాస్కర్‌రెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : జిల్లా పరిషత్‌ సిఇఒ కె.భాస్కర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఓట్ల తొలగింపులో నిబంధనలు పాటించని కారణంగా ఆయనపై వేటు పడింది. ఈ మేరకు చీఫ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ ఈనెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో 2020, 2021 సంవత్సరంలో జరిగిన ఓటర్ల జాబితా తయారీలో 1116 ఓట్లను తొలగించారు. ఆ సమయంలో కె.భాస్కర్‌రెడ్డి అక్కడ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా పనిచేశారు. ఈ విషయంపైనే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించి ఓటర్ల జాబితాను పరిశీలించిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి విచారణ సైతం చేపట్టింది. ఈ విచారణలో బాధ్యులుగానున్న వారిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇది వరకే ఇద్దరు బిఎల్‌ఒలపై వేటు పడింది. మరికొంత మందిపైనా వేటు పడే అవకాశాలున్నట్టు సమాచారం.
వెంటాడుతున్న తప్పిదాలు
ఓటర్ల జాబితాలో జరిగిన తప్పిదాలు వరుసగా ఉద్యోగులను వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు బిఎల్‌ఒ (బూత్‌ లెవల్‌ అధికారులు) సస్పెన్షన్‌కు గురయ్యారు. చిలకురికి గ్రామంలో మూడు వేల ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అప్పటి జిల్లా కలెక్టరు ఇద్దరు బిఎల్‌ఒలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దాని తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఉరవకొండలో పర్యటించి ఆర్డీవోతోపాటు, తహశీల్దారు సమక్షంలో విచారణ జరిపింది. ఈ విచారణ అనంతరం మరికొంత మందిపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా జెడ్‌పి ఇసిఒ భాస్కర్‌రెడ్డిపై వేటు పడింది. ఆయన కంటే ముందున్న జెడ్‌పి సిఇఒ శోభా స్వరూప రాణిపైనా వేటు పడే అవకాశాలున్నట్టు అధికారవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈమెతోపాటు మరో ఇద్దరు ఇఒఆర్‌డిలపైనా చర్యలుండే అవకాశాలున్నట్టు సమాచారం.
ఓటర్ల సర్వేపైనా ఇద్దరిపై వేటు
ఓటర్ల సర్వేలోనూ ఇద్దరిపై వేటు పడింది. వజ్రకరూరు మండలంలో ఓటర్ల సర్వే ప్రారంభించకపోవడంపై జిల్లా కలెక్టరు గౌతమి సీరియస్‌ అయ్యారు. ఈసందర్భంగా ఇద్దరిని సస్పెన్షన్‌ చేశారు. ఇలా ఎన్నికల్లో తప్పిదాలపై ఒకరి తరువాత ఒకరిపై వేటు పడుతుండటంతో ఎన్నికల విధులంటేనే సిబ్బందిలో గుబులు రేగుతోంది. ఏ చిన్న తప్పు జరిగినా ఇబ్బందులు తప్పవన్న భయం నెలకొంటోంది.