గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని జడ్డంగి నుండి గొబ్బులమడుగు మీదుగా డి.భీమవరం వెళ్లే రహదారి నిర్మాణ పనులను తక్షణం చేపట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న మట్టి రహదారి అధ్వాన స్థితిలో ఉన్న విషయాన్ని గిరిజనులు రామారావు దృష్టికి తీసుకురావడంతో బుధవారం ఆయన ఆ రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ 2013లో సుమారు రూ.7 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టారని, అయితే నాడు ఫారెస్ట్ అనుమతులు లేవని అటవీశాఖ అడ్డంకులు చెప్పడంతో రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. పదేళ్లు కావడంతో మట్టి రహదారి అధ్వానంగా మారిందని, గొబ్బిలమడుగు గండి ప్రమాద భరితంగా ఉందని, ఈ రహదారిపై ప్రయాణించేటప్పుడు తరచూ వాహనాలు ప్రమాదాలు గురై అనేకమంది గిరిజనులు గాయాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి పూర్తయితే ఈ గ్రామాలతో పాటు జడ్డంగి నుండి అడ్డతీగల వెళ్లే వారికి కూడా అణువుగా, దగ్గరగా ఉంటుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఈ రహదారిపై ప్రయాణం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.










